అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Sanjay | కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, పదేళ్లలో జరిగిన అవినీతిపై జరుగుతున్న విచారణలో ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడమే అందుకు నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister of State for Home Affairs Bandi Sanjay) ఆరోపించారు. శుక్రవారం జనగామ పర్యటనకు వెళ్లిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, అన్ని కుంభకోణాలు పక్కకు పోయాయని.. ఏ ఒక్క స్కామ్ లోనూ కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే రెండు పార్టీలూ ఒక్కటే అని, నువ్వు కొట్టినట్టు చెయ్, నేను ఏడ్చినట్టు చేస్తా అనే ధోరణితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
Bandi Sanjay | వివాదాలు పరిష్కరిస్తే విమర్శలా..?
బనకచర్లపై కమిటీ ఏర్పాటు విషయంలో తెలంగాణ, ఆంధ్ర సీఎంలు ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇద్దరు సీఎంలు వారి సొంత ఎజెండాలతో వస్తే అవి వెంటనే తేల్చే విషయాలు కాదని భావించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి.. వాటిని నిపుణులతో చర్చించి పరిష్కరించడానికి కమిటీ అవసరమని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి (central government) అవసరమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ జల వివాదం పరిష్కంచాలని ప్రయత్నిస్తే తప్పుపడుతున్నారని మండిపడ్డారు. నీటి విషయంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడతామని స్పష్టం చేశారు. నీటికి సంబంధించి తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని వెల్లడించారు. బీఆర్ఎస్ వాళ్లు మళ్లీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Bandi Sanjay | కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత
ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) తట్టెడు మట్టి ఎత్తిపోసింది లేదని బండి సంజయ్ విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంతో తక్కువ కాలంలోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని.. గ్రామీణ వ్యవస్థ సర్వనాశనం అవుతోందన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందన్నారు. తెలంగాణలో ఏ గ్రామానికైనా వస్తానని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిపై చర్చిద్దామా? ఇందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా? అని సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో కేసీఆర్ (KCR) జల్సాలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అప్పుడు ఫోన్లు ట్యాప్ చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానం వస్తోందని ఆరోపించారు.
Bandi Sanjay | ముస్లింలు లేని రిజర్వేషన్లు కావాలి..
బీసీలకు రేవంత్ సర్కార్ (Revanth government) అన్యాయం చేస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. బీసీల్లో ముస్లింలను చేర్చి 42 శాతం ఇవ్వడం సరికాదన్నారు. బీసీలకు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) తీవ్ర అన్యాయం చేశారని, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ప్రజాప్రతినిధులు కావాల్సిన బీసీల స్థానాల్లో ఎంఐఎం వాళ్లు అయ్యారన్నారు. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని.. దాంట్లో ముస్లింలను కలపొద్దని సంజయ్ డిమాండ్ చేశారు.
Bandi Sanjay | బీజేపీదే విజయం..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. రెండు పార్టీల నేతలు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలే తమ ప్రచార కర్తలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీజేపీకి ఓటు వేసి గెలిపించడానికి కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.