అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. వారికి పీఎం స్వనిధి క్రెడిట్ కార్డులను అందించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేరళలో ప్రారంభించారు.
ప్రధాని కేరళలో పలు అభివృద్ధి పనులు, అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు (PM SVANidhi Credit Card)లను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సౌకర్యం ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. కొత్త రైళ్లు ప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతాయని, పర్యాటక రంగానికి మద్దతు ఇస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులు తిరువనంతపురాన్ని ఒక ప్రధాన కేంద్రంగా మార్చడానికి సహాయపడతాయని ప్రధానమంత్రి అన్నారు,
PM Modi | వడ్డీ లేకుండా..
వీధి వ్యాపారుల కోసం యూపీఐ-అనుసంధానిత, వడ్డీ లేని రివాల్వింగ్ క్రెడిట్ సౌకర్యమైన పీఎం స్వనిధి క్రెడిట్ కార్డును ప్రధాని ప్రారంభించారు. కేరళ (Kerala)లో 10 వేల మంది లబ్ధిదారులకు, తిరువనంతపురంలో 600 మందికి పైగా క్రెడిట్ కార్డులు అందాయని అన్నారు. గతంలో వీధి వ్యాపారులు అధిక వడ్డీ రేట్లకు చిన్న మొత్తాలను అప్పుగా తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డారని ప్రధాని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వారికి రుణాలు ఇస్తోందన్నారు.
PM Modi | అధికారంలోకి వస్తాం
కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram)లోని పుత్రికండమ్ మైదానంలో జరిగిన బిజెపి ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. తనకు ఇది ఒక భావోద్వేగ క్షణం అన్నారు. లక్షలాది మంది కార్యకర్తల కృషి ఫలించిందన్నారు. ఇటీవల తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మాట్లాడారు. కార్యకర్తల శక్తి కేరళలో ఖచ్చితంగా మార్పు వస్తుందనే ఆశను ఇస్తుందన్నారు. 1987 కి ముందు బీజేపీ గుజరాత్లో ఒక చిన్న పార్టీ అని చెప్పారు. 1987లో మొదటిసారి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గెలుచుకుందని గుర్తు చేశారు. గుజరాత్లో బీజేపీ (BJP) పాలన ఒక నగరం నుంచి ప్రారంభమైందన్నారు. అదేవిధంగా కేరళలలో సైతం అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, శబరిమల బంగారు దొంగతనంపై దర్యాప్తు చేస్తామన్నారు. దోషులను జైలులో పెడతామని హామీ ఇచ్చారు.