అక్షరటుడే, వెబ్‌డెస్క్: Silver Price | బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. రాకెట్ వేగంతో రేట్లు దూసుకెళ్తుండటంతో సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. బంగారం కంటే వెండి ధరలు అధికంగా పెరుగుతుండటం గమనార్హం.
కొన్ని రోజులుగా పసిడి, వెండి పరుగులు ఆగడం లేదు. బుధవారం ఏకంగా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.3,220 పెరిగి 1,65,170కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2,950 పెరిగడంతో రూ.1,51,400 పలుకుతోంది. కిలో వెండి రూ.13 వేలు పెరగడంతో రూ.4 లక్షలకు చేరింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కళ్ల ముందే రేట్లు దూసుకు పోతుండటంతో కొనుగోలు చేసేది ఎలా అని ఆలోచిస్తున్నారు.
Silver Price | అంతర్జాతీయ పరిణామాలతో..
అంతర్జాతీయ అనిశ్చితులు, ఆర్థిక పరిస్థితులతో బంగారం, వెండి ధరలు (Silver Rates) భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా టారిఫ్‌లతో ప్రపంచ మార్కెట్లు కుదేలు అవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. తమ డబ్బులను గోల్డ్, సిల్వర్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేగాకుండా పలు దేశాల కేంద్ర బ్యాంకులు సైతం భారీగా పసిడి కొనుగోలు చేశాయి. మరోవైపు ఇటీవల తయారీ రంగంలో వెండికి డిమాండ్ పెరిగింది. అలాగే రేట్లు పెరుగుతుండంతో సామాన్య ప్రజలు బంగారం కొనలేక పోతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా వెండి కొని పెట్టుకుంటున్నారు. ఈ కారణాలతో రేట్లు భారీగా పెరుగుతున్నాయి.
Silver Price | దుకాణలు వెలవెల
రాష్ట్రంలో మరో 20 రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ప్రస్తుతం బంగారం ఆభరణాల దుకాణాలు సందడిగా ఉండాలి. కానీ రేట్లు పెరగడంతో ప్రజలు బంగారం కొనే పరిస్థితి లేదు. దీంతో దుకాణాలు వెలవెలబోతున్నాయి. గిరాకీలు బాగా తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు ఆడపిల్ల పెళ్లిలు పెట్టుకున్న తల్లిదండ్రులు పెరుగుతున్న బంగారం రేట్లు (Gold Rates) చూసి కలవర పడుతున్నారు.