అక్షరటుడే, వెబ్డెస్క్ : DCC President | రాష్ట్రంలో పార్టీ సంస్థగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షుల నియామకానికి చర్యలు చేపట్టింది. అయితే ఈ సారి పదవుల భర్తీ విషయంలో పార్టీ (Congress Party) కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలుస్తోది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తుంది. అయితే ఇప్పటికి జిల్లా కమిటీలను మళ్లీ నియమించలేదు. గతంలోని డీసీసీలే కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ 22 మంది పరిశీలకులను నియమించింది. వారు శనివారం ఉదయం హైదరాబాద్(Hyderabad)కు చేరుకున్నారు. వారం రోజుల పాటు వారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను ఏఐసీసీకి అందజేస్తారు. అనంతరం డీసీసీ అధ్యక్షులను (DCC President) కాంగ్రెస్ అధినాయకత్వం నియమించనుంది. ఇప్పటికే చాలా మంది ఆశావహులు పదవి కోసం దరఖాస్తులు సమర్పించారు.
DCC President | వారికి నో ఛాన్స్
డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకునేవారు ఐదేళ్ల పాటు పార్టీలో ఉండాలని రూల్ పెట్టారు. దీంతో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు దక్కనున్నాయి. అలాగే ప్రస్తుతం అధ్యక్షులుగా కొనసాగుతున్న వారికి రెండో సారి అవకాశం లేదని పార్టీ స్పష్టం చేసింది. అలాగే ప్రజాప్రతినిధుల బంధువులకు కూడా అవకాశాలు లేవని నేతలు పేర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఆశావహులు ఏఐసీసీ(AICC) పరిశీలకులతో వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు పెట్టొద్దని ఇప్పటికే పార్టీ కండీషన్ పెట్టింది. పార్టీ కోసం పని చేసే వారికే పదవులు ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు దక్కే అవకాశం లేదు. కాగా ఈ నెల 15 నాటికి ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి నివేదిక అందించనున్నారు. అనంతరం నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.