అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో 15 రోజుల క్రితం వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగస్టు 26 రాత్రి నుంచి 27 సాయంత్రం వరకు కుండపోత వాన కురిసింది.
ఒక్కసారిగా కురిసిన వర్షంతో కామారెడ్డి (Kamareddy) పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా అతలాకుతలం అయింది. ఊహించని జలప్రలయం ఒక్కసారిగా ముంచుకురావడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెల్లారే సరికి ఇళ్లను వరద చుట్టేయడంతో భయంభయంగా గడిపారు. ఇళ్లపైకి చేరి సాయం కోసం ఎదురు చూశారు. పట్టణంలో వర్షబీభత్సంపై ఓ కవి ఆవేదనను కవిత రూపంతో మలిచాడు.
అది వానంటే వాన కాదు మాయదారి వాన
ఉరుములు మెరుపులతో మొగులుకు తూటు వడ్డ చందంగా గుమ్మరించింది
ఎక్కడ చూసినా రాక్షస వరదలు చుట్టు ముట్టి అందరిని వణికించినై
వేకువజామునే అనకొండలా చుట్టేసినా వరద తాకిడికి జనం హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు
వరదల్లో పంటలు మునిగి పోయాయి
రోడ్లు కొట్టుకు పోయాయి
చాలా మంది వరదల్లో చిక్కుకొని క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపారు
కొందరిని పోలీస్ బలగాలు కాపాడితే
మరి కొందరిని హెలికాప్టర్ల ద్వారా ఒడ్డుకు చేర్చారు
పాపం ఎవరిదైనా సామాన్యులే బలయ్యారు
నేలమ్మను నమ్ముకున్న రైతన్న గుండెలవిసేలా విలపించసాగాడు
ఎన్నడు కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన ఆ రాక్షస వాన ఎందరి కలలనో కల్ల చేసింది
బతుకులను కకావికలం చేసింది
ఇలాంటి వరదలు రాకుండా ఇకనైనా పాలకులు కళ్ళు తెరవాలని ఆశిద్దాం
– డి.శ్రీరామ్, కామారెడ్డి