అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | అధికారులు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించక పోవడం వల్లే కుక్కల బెడద తీవ్రమైందని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలన్న సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ సందర్బంగా అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. జంతు సంతతి నియంత్రణ(Animal Reproduction Control) చర్యలు చేపట్టక పోవడంతో ఈ సమస్యకు దారి తీసిందని ఆక్షేపించింది. కోర్టులో హాజరు కావాలని సంబంధిత అధికారులను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
Supreme Court | రోజుకు 10 వేల కుక్కకాటు కేసులు..
ఢిల్లీ నుంచి శునకాలను తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సమర్థించింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(General Tushar Mehta) వాదనలను వినిపిస్తూ.. మాంసాహారం తినే వాళ్లు కూడా తాము జంతు ప్రేమికులమని చెప్పుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపిన ఆయన.. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని చెప్పారు. ఇది పరిష్కరించాల్సిన తీవ్రమైన సమస్య.. కుక్క కాటు(Dog Bite) వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారని తెలిపారు. ఒక్కసారి గణంకాలను పరిశీలించాలని కోర్టును కోరారు. దేశంలో ఏటా సగటున 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి, అంటే సగటున రోజుకు 10 వేల మంది కుక్కకాటు బాధితులుగా మారుతున్నారని వివరించారు. రేబిస్ మరణాలను(Rabies Deaths) కూడా పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. కేవలం కుక్కలకు స్టెరిలైజేషన్ చేయడం వల్ల రేబిస్ మరణాలు ఆగిపోవని చెప్పారు.
మరోవైపు, కుక్కలను తరలించాలన్న తీర్పుపై స్టే విధించాలని ఓ ఎన్జీవో తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(Senior Advocate Kapil Sibal) కోర్టును కోరారు. కుక్కలకు షెల్టర్లు లేవని, వాటిని ఎక్కడకు తరలిస్తారని ప్రశ్నించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు.2022-25 వరకు ఢిల్లీ, గోవా, రాజస్థాన్‌లలో రేబిస్ మరణాలు సున్నా అని మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేర్కొన్నారు. రెండు వారాల క్రితం పార్లమెంటు నుండి వచ్చిన దాని స్వంత డేటాను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. షెల్టర్లు ఇప్పటికే ఉంటే ఆదేశాలు సమస్య కాదని ఆయన అన్నారు.