అక్షరటుడే, వెబ్‌డెస్క్ : British Airways | విమానంలో కాక్‌పిట్ డోర్ తెరిచి ఉంచిన ఓ పైలెట్‌పై ఎయిర్‌లైన్స్ సంస్థ చర్యలు చేపట్టింది. అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విమానంలో కాక్‌పిట్‌ను ప్రయాణికుల నుంచి వేరు చేయడానికి కాక్‌పిట్ డోర్ (Cockpit Door) ఏర్పాటు చేస్తారు. 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాదులు రెండు విమానాలను హైజాక్ చేసి న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్ కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం అన్ని ఎయిర్‌లైన్ సంస్థలు (Airlines) కాక్‌పిట్‌లోకి ఎవరూ రాకుండా డోర్ ఏర్పాటు చేయడమే కాకుండా భద్రతా చర్యలు చేపట్టాయి. అయితే ఓ పైలెట్ కాక్‌పిట్ డోర్ వేయకుండా అత్యుత్సాహం చూపగా బ్రిటిష్ ఎయిర్ లైన్స్ (British Airways) చర్యలు చేపట్టింది.
British Airways | కుటుంబ సభ్యుల కోసం..
బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఫ్లైట్ ఇటీవల లండన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. పైలట్(Pilot) కుటుంబ సభ్యులు, బంధువులు అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. దీంతో తాను విమానం ఎలా ఆపరేట్ చేస్తానో కుటుంబ సభ్యులకు చూపాలని సదరు పైలెట్ భావించాడు. దీంతో కాక్‌పిట్ డోర్ తెరిచి ఉంచాడు. చాలా సేపు డోర్ తెరిచి ఉంచడంతో ప్రయాణికులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అమెరికాలో విమానం ల్యాండ్ అయిన తర్వాత డోర్ తెరిచి ఉంచిన అంశాన్ని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు.
British Airways | అత్యవసర దర్యాప్తు
పైలెట్ తీరుపై బ్రిటీష్ ఎయిర్వేస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాద నిరోధక నిబంధనలు (Anti Terrorism Regulations) ఉల్లంఘించాడని పేర్కొంటూ అతనిని సస్పెండ్ చేసింది. న్యూయార్క్ నుంచి తిరిగి లండన్ రావాల్సిన విమానాన్ని కూడా అధికారులు రద్దు చేశారు. ప్రయాణికుల కోసం ఇతర ఏర్పాట్లు చేశారు. కాక్‌పిట్ డోర్ తెరిచి ఉంచిన ఘటనపై సివిల్ ఏవియేషన్ అథారిటీ (Civil Aviation Authority) కూడా అత్యవసర దర్యాప్తు చేపట్టింది.