అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Rajanarsimha | ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ హాస్పిటళ్లపై కొందరు బురద జల్లుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao), జగదీశ్ రెడ్డి తదితరులు మంగళవారం హైదరాబాద్‌లోని (Hyderabad) పలు బస్తీ దవాఖానాలను సందర్శించిన విషయం తెలిసిందే. వారు మాట్లాడుతూ ఆయా దవాఖానాల్లో వసతులు, మందులు లేవని ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి రాజనర్సింహా (Minister Rajanarsimha) వారికి కౌంటర్ ఇచ్చారు. పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ హాస్పిటళ్లపై కొంతమంది బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
Minister Rajanarsimha | మెరుగైన వైద్య సేవలు
బస్తీ దవాఖానాల ద్వారా ప్రతి రోజూ సుమారు 45 వేల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డయాగ్నస్టిక్స్ హబ్ (Diagnostics Hub) ద్వారా బస్తీ దవాఖానాలకు వచ్చే రోగులకు 134 రకాల పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. 24 గంటల్లో టెస్ట్ రిపోర్ట్‌లను సైతం అందిస్తున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందుతుండడంతో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోగుల రద్దీ తగ్గిందన్నారు.
Minister Rajanarsimha | ప్రైవేట్ హాస్పిటళ్లకు లబ్ధి చేకూర్చేలా..
రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ హాస్పిటళ్లపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలు డాక్టర్లు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. బస్తీ దవాఖానాల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
