అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా (Medak District) కేంద్రంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ సర్పంచులు 80 శాతం నుంచి 90 శాతం వరకు గెలుస్తారన్నారు. కానీ తెలంగాణలో (Telangana) ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ 4000కు పైగా సర్పంచులతో 30-40 శాతం పంచాయతీలు గెలిచిందన్నారు. సర్పంచ్ ఎన్నికలకు ముఖ్యమంత్రి స్థాయి వాళ్లు తిరగరని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని జిల్లాల్లో ప్రచారం చేశారన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, జిల్లా జిల్లాకు తిరిగి ప్రచారం చేసినా బీఆర్ఎస్ 4 వేల సీట్లు గెలిచిందని చెప్పారు.
Harish Rao | యూరియా కావాలి
వ్యవసాయానికి యూరియా, నీళ్లు కావాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌లు కావాలని అంటుందన్నారు. యూరియా సరఫరా చేయడం చేతగాక ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌ల పేరిట రైతులను ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయం చేయాలా యాప్ చుట్టూ, మ్యాప్ చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో యూరియా కొరత ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ వచ్చాక కష్టాలు మొదలు అయ్యాయని చెప్పారు.
Harish Rao | రైతు భరోసా ఎగ్గొట్టే కుట్ర
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రైతు భరోసా (Rythu Bharosa) ఎగ్గొట్టే కుట్ర చేస్తోందని హరీశ్‌రావు అన్నారు. యాసంగి రైతు బంధు సాగు చేసినోళ్లకే ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి లీకులు ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 50 నుంచి 60 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తారన్నారు. పత్తి 6,7 నెలల పంట అన్నారు. దీంతో రైతులు ఒకే పంట వేస్తారని చెప్పారు. పత్తి రైతులకు యాసంగి రైతు భరోసా వేయరా అని ప్రశ్నించారు. కందులు, చెరుకు, పసుపు రైతులకు రైతు భరోసా ఇస్తారా లేదా అన్నారు.
Harish Rao | సింగూరుపై స్పష్టత ఇవ్వాలి
మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్టకు సింగూరు నుంచి నీటిని విడుదల చేస్తారా లేదా అనేది స్పష్టత ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సింగూరు ప్రాజెక్ట్ (Singur Project) మరమ్మతులు చేయాలనే పేరిట ప్రాజెక్టు మొత్తం ప్రభుత్వం ఖాళీ చేసిందన్నారు. దీంతో యాసంగిలో పంటలు వేయాలా వద్దా అని రైతులు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఘనపురం ఆనకట్టపై ఆధారపడి పాపన్నపేట, కొల్చారం, మెదక్ రూరల్, హవేళి ఘన్పూర్ మండల్లాలో రైతులు సాగు చేస్తారన్నారు. ప్రస్తుతం సింగూరులో 15 టీఎంసీల నీరు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే దాని నుంచి ఘనపురం ఆనకట్టకు విడుదల చేస్తారా లేదా అనే విషయమై స్పష్టత ఇవ్వాలన్నారు. సకాలంలో ప్రభుత్వం మరమ్మతులు చేసి ఉంటే ఇవాళ యాసంగి పంటకు రైతులు ఇబ్బంది పడేవాళ్లు కాదన్నారు.