Homeజిల్లాలునిజామాబాద్​Babli Project | బాబ్లీకి కొనసాగుతున్న వరద.. గేట్ల మూసివేత లేనట్టేనా..?

Babli Project | బాబ్లీకి కొనసాగుతున్న వరద.. గేట్ల మూసివేత లేనట్టేనా..?

బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అక్టోబర్​ 28వ తేదీ అధికారికంగా మూసివేయాల్సి ఉంటుంది.. కానీ బాబ్లీకి ఎగువ నుంచి వస్తున్న వరద దృష్ట్యా గేట్లు మూసివేసే అవకాశాలు తక్కువని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ : Babli Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అధికారికంగా అక్టోబర్​ 28న మూసివేయాల్సి ఉంటుంది. కానీ బాబ్లీ ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద (Heavy Flood) వస్తోంది. దీంతో గేట్ల మూసివేతపై సందిగ్ధత నెలకొంది.

సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు అక్టోబర్​ 28వ తేదీ అర్ధరాత్రి త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో గేట్లను మూసివేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారికంగా మూసివేత నిర్ణయంపై సంతకాలు చేయనున్నారు.

Babli Project | ఇన్​ఫ్లో వస్తుండటంతో..

బాబ్లీ ప్రాజెక్ట్ (Babli Project) ఇప్పటికే నిండుకుండలా మారడం, ఎగువ నుంచి ఇన్​ఫ్లో ఎక్కువగానే వస్తుండడంతో ఇప్పట్లో గేట్ల మూసివేత ఉండకపోవచ్చని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమైతే అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి గేట్లు మూసివేయాల్సి ఉంటుంది. కానీ ఇరు రాష్ట్రాల అధికారుల రాకపోకల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 29వ తేదీ ఉదయం గేట్లను అధికారికంగా మూసివేయనున్నారు.

ఈ త్రిసభ్య కమిటీలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (Sriramsagar Project), నాందేడ్ ఇరిగేషన్, సీడబ్ల్యూసీ అధికారులు ఉన్నారు. అక్టోబర్​ 28వ తేదీ నుంచి బాబ్లీ గేట్లను ఎప్పుడైనే మూసివేసే అవకాశం నాందేడ్​ ఇరిగేషన్​ అధికారులకు ఉంటుంది. వరద ఎక్కువైతే మాత్రం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు సైతం నాందేడ్​ అధికారులకు ఉంటాయి.

Babli Project | నీటి విడుదల కొనసాగుతుంది..

బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుందని ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఈఈ చక్రపాణి పేర్కొన్నారు. ప్రస్తుతం బాబ్లీగేట్లు మూసివేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి కాబట్టి త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి గేట్లను మూసివేసినట్టు సంతకాలు చేస్తారని ఆయన పేర్కొన్నారు.