అక్షరటుడే, కామారెడ్డి: CPS | సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎన్జీవోస్ (TNGO’s Kamareddy) జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కామారెడ్డి (Employees’ JAC Kamareddy) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల పాత పెన్షన్ సాధన కోసం నల్లచొక్కాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ ఒకటవ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా (Pension Rebellion Day) పాటించాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన తెలిపామన్నారు. సీపీఎస్ అనేది ఉద్యోగుల పాలిట పెను శాపంగా మారిందన్నారు. పెన్షన్ లేక ఉద్యోగులు ఆర్థిక భద్రత లేక వృద్ధాప్యంలో ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరారు.
అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్ డీఏలతో పాటు ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులకు అత్యంత అవసరమైన ఉద్యోగుల ఆరోగ్య కార్డులు లేక ఆర్థికంగా ఉద్యోగులు నష్టపోతున్నారని, హెల్త్‌కార్డులు (Health Cards) మంజూరు చేసి ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అనంతరం ఉద్యోగులు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ దేవేందర్, కో ఛైర్మన్ ఆకుల బాబు, చింతల లింగం, డిప్యూటీ సెక్రెటరీ నాగరాజు, సాయిరెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు.