
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maharashtra : ఏది ప్రేమో.. ఏది ఆప్యాయతో.. ఏది నయవంచననో తెలియని దుస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే నట్టేట ముంచేస్తున్నారు. వయసులో ఉన్నవారే మోసగాళ్ల ఉచ్చులో పడి నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఇక వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణం.
మహారాష్ట్రMaharashtra లో తాజాగా జరిగిన ఓ ఘటన.. ముక్కూ మొహం తెలియని వాళ్లను గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదమో కళ్లకు కట్టినట్లు చూపుతోంది. వయసు మీద పడి.. జవనాడులు సడలి.. ఆలనా పాలనా చూసుకునేవారు లేక అల్లాడుతున్న 82 ఏళ్ల వృద్ధుడి పరిస్థితిని గమనించిన ఓ మహిళ అతడి పంచన చేరింది. ఆ పెద్ద మనిషికి కావాల్సిన సపర్యలు చేసింది. అలా కేర్ టేకర్‌గా అన్నీ తానై చూసుకుంది. ఆమెను పూర్తిగా నమ్మిన వృద్ధుడు తన విషయాలన్నీ షేర్ చేసుకున్నాడు. అలా బ్యాంకు అకౌంట్లు, ఆస్తులు కూడా అప్పగించేంతగా ఆమె పూర్తిగా నమ్మబలికింది. ఆ వృద్ధుడు తనను పూర్తిగా నమ్మాడని నిర్ధారించుకున్నాక.. ఆ మహిళ తన అసలు స్వరూపం బయటపెట్టింది అతడి ఆస్తులన్నీ తన పేరు మీద రాయించుకుంది. చివరికి ఆ వృద్ధుడిని వృద్ధాశ్రమానికి తరలించింది. వృద్ధుడి కుమారుడు వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది.
ముంబయి(Mumbai)లోని పోవై(Powai) ప్రాంతంలో ఉన్న హిరాందానీ గార్డెన్స్(Hiranandani Gardens)లోని అపార్ట్‌మెంట్‌లో ఐఐటీ(IIT) రిటైర్డ్ ప్రొఫెసర్ మన్మోహన్(82) ఉంటున్నారు. అతని భార్య, కుమారుడు.. ఉద్యోగ నిమిత్తం పుణేలో జీవిసిస్తున్నారు.
కాగా, మన్మోహన్ వయసు పైబడటంతో తన పనులు తాను చేసుకోవడం చాలా కష్టంగా మారింది. ఇదే సమయంలో పార్కులో ఆయనకు నికితా నాయక్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అలా గత కొన్నేళ్లుగా మన్మోహన్ వద్ద నికితా నాయక్ కేర్ టేకర్‌గా పని చేసింది. రిటైర్డ్ ప్రొఫెసర్‌కు ఉన్న అనారోగ్య కారణాలను సదరు మహిళ అవకాశంగా తీసుకుంది. ఆయన వద్ద ఉన్న 3 ఫ్లాట్లతో పాటు మొత్తం ఆస్తిని తన పేరు మీదకు రాయించుకుంది ఆ వంచకురాలు. ఆ తర్వాత ఆ వృద్ధుడిని అనాథాశ్రమంలో చేర్పించి అక్కడి నుంచి పారిపోయింది.
గత నెలలో ప్రొఫెసర్ కుమారుడు ఇంటికి వచ్చి చూడగా.. అతడి తండ్రి కనిపించలేదు. స్థానికంగా ఉన్న ఓ అనాథాశ్రమంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. ఈ మేరకు పోలీసుల(POLICE)కు ఫిర్యాదు చేశాడు.