అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చొరవ చూపాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. మండల విద్యాశాఖ అధికారులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. రానున్న వారం రోజుల పాటు విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ బడుల్లో మెరుగుపడిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ఉత్తీర్ణత, నాణ్యమైన విద్యా బోధన, ఉచిత యూనిఫామ్, టెక్ట్స్‌బుక్స్ సమకూరుస్తున్న విషయాలపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (Amma Adarsha School Committee) ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతు పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా అవసరమైన బడుల్లో వంటశాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఈవో అశోక్, ఎంఈఓలు అధికారులు పాల్గొన్నారు.