అక్షరటుడే, వెబ్డెస్క్ : GHMC Wards | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను రెట్టింపు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Chief Secretary Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలో ప్రస్తుతం 150 వార్డులు ఉన్నాయి. వీటిని 300కు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జీహెచ్ఎంసీలో 27 కార్పొరేషన్, మున్సిపాలిటీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో నగర పరిధి పెరిగింది. ఈ క్రమంలో వార్డుల సంఖ్య పెంచుతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వార్డుల పునర్విభజన భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు కీలకంగా మారనుంది. గెజిట్ విడుదల అయిన తర్వాత వారం పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వనున్నారు.
GHMC Wards | పట్టు కోసం..
రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరగనున్నాయి. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. తర్వాత మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరుగుతాయి. 2026 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ పాలకవర్గ పదవీ కాలం కూడా ముగియనుంది. దీంతో ఆ ఎన్నికలు కూడా త్వరలోనే జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వార్డుల సంఖ్య రెట్టింపు చేయడం గమనార్హం. ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకునేలా కాంగ్రెస్ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
GHMC Wards | గతంలో మజ్లిస్ ఆధిపత్యం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు మజ్లిస్ ఆధిపత్యం ఉండేది. 2002లో 99 వార్డులు ఉండేవి. అప్పుడు ఎంఐఎం 34, టీడీపీ 22, కాంగ్రెస్ 19, బీజేపీ 18 స్థానాల్లో గెలుపొందాయి. అయితే 2004 వైఎస్సార్ అధికారంలోకి వచ్చారు. 2007లో ఆయన జీహెచ్ఎంసీ పరిధి పెంచారు. దీంతో అప్పటి వరకు అధికారంలో ఉన్న ఎంఐఎం, టీడీపీకి గండి పడింది. పరిధి పెరగడంతో కాంగ్రెస్ పట్టున్న స్థానాలు జీహెచ్ఎంసీలో చేరాయి. ఫలితంగా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 52 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 55, ఎంఐఎం 43, బీజేపీ 5 వార్డుల్లో విజయం సాధించాయి. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 2016, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమైంది. దీంతో నగరంలో మళ్లీ పట్టు సాధించాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఈ క్రమంలో గతంలో వైఎస్సార్ వార్డులను పెంచడం ద్వారా అధికారంలోకి వచ్చినట్లు కాంగ్రెస్ సైతం అదే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 300కు పెంచడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ పట్టున్న ప్రాంతాలు తగ్గనున్నాయి.2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించిన తర్వాత, GHMC భారతదేశంలో అతిపెద్ద మునిసిపల్ సంస్థగా అవతరించింది.