అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Police | తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ బి.శివధర్ రెడ్డి (DGP Sivadhar Reddy) ప్రకటించారు. 2025 సంవత్సరం వార్షిక నివేదికను మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే నేరాల సంఖ్యలో 2.33 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించారు. 2024లో 2,34,158 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 2,28,695కు పరిమితమయ్యాయన్నారు. ఇది పోలీసు యంత్రాంగం సమర్థవంతమైన చర్యల ఫలితమని డీజీపీ అన్నారు.
డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ఎస్ కింద నమోదైన కేసులు కూడా 1.45 శాతం తగ్గాయి. గతేడాది 1,69,477 కేసులుంటే, ఈ ఏడాది 1,67,018కు చేరాయి. నేర నిరూపణ రేటు గణనీయంగా పెరిగి, 35.63 శాతం నుంచి 38.72 శాతానికి చేరుకుంది. ఈ యేడు నాలుగు కేసుల్లో మరణశిక్షలు, 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ ఖైదు విధించినట్టు నివేదిక తెలియజేస్తోంది. పోక్సో చట్టం కింద 141 కేసుల్లో 154 మంది నిందితులకు జీవిత ఖైదు, ముగ్గురికి మరణశిక్ష పడింది. అలాగే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నివారణ చట్టం కింద 28 కేసుల్లో 53 మందికి యావజ్జీవ శిక్ష విధించారు.
Telangana Police | ఈ కేసుల్లో గణనీయమైన తగ్గుదల
వివిధ రకాల నేరాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. హత్యలు 8.76 శాతం, అత్యాచారాలు 13.45 శాతం, దోపిడీలు 27 శాతం, దొంగతనాలు 9.1 శాతం తగ్గాయి. వరకట్న హత్యలు 2 శాతం, ఎస్సీ, ఎస్టీ కేసులు 9.5 శాతం తగ్గడం గమనార్హం. అయితే, నమ్మకద్రోహం కేసులు మాత్రం 23 శాతం పెరిగాయి. మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్ (She Teams) యాక్టివ్గా పనిచేస్తున్నాయని డీజీపీ తెలిపారు.
Telangana Police | సైబర్ నేరాల నియంత్రణలో ముందంజ
సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ (Telangana) ముందుంజలో నిలిచింది. జాతీయ స్థాయిలో సైబర్ క్రైం 41 శాతం పెరిగినా, రాష్ట్రంలో మూడు శాతం తగ్గింది. రూ. 246 కోట్ల మేర ఆస్తులు రికవరీ చేసి, 24,498 మంది బాధితులకు రూ. 159.65 కోట్లు రిఫండ్ చేశారు. మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ పోలీసులు రోజుకు సగటున 111 ఫోన్లు తిరిగి బాధితులకు అందజేస్తున్నారు.
Telangana Police | 509 మంది మావోల లొంగుబాటు
2025లో 509 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వీరిలో 23 మంది తెలంగాణకు చెందినవారు కాగా.. ఇతరులు ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినవారే. ఈ లొంగుబాట్లు మావోయిస్టు సంస్థ బలహీనపడుతున్న నిదర్శనమని అధికారులు తెలిపారు.
Telangana Police | సమర్థంగా పనిచేసిన పోలీస్ శాఖ
రాష్ట్రంలో జరిగిన ముఖ్య సంఘటనల నిర్వహణలో తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేసిందని డీజీపీ తెలిపారు. మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు, మిస్ వరల్డ్ పోటీలు, అంతర్జాతీయ ఫుట్బాల్ కార్యక్రమం, నిజామాబాద్-కామారెడ్డి వరదలు వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. వరదల సమయంలో ప్రాణనష్టం లేకుండా చూశామన్నారు. మొత్తంగా, 2025 సంవత్సరం తెలంగాణ పోలీసు శాఖ నేర నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, సామాజిక బాధ్యతల్లో బాగా పనిచేసిందని చెప్పారు.