అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nominations Concluded | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్లు స్వీకరించారు. శుక్రవారం రాత్రి వరకు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించారు. అమెరికాలో ఉన్న ఆయన జూమ్ మీటింగ్ ద్వారా పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud), జిల్లా ఇన్ఛార్జీ మంత్రులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. కాగా సీఎం నేడు హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం ఆయన ఫిబ్రవరి 3 నుంచి జిల్లాల్లో పర్యటించి, మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.
Nominations Concluded | ఒక్కరోజే 19,180 నామినేషన్లు
రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో 28,456 మందికి పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. చివరి రోజు ఒక్క రోజే 19,180 మంది నామినేషన్లు (Nominations) దాఖలు చేయడం గమనార్హం. నామినేషన్ల పర్వం ముగియడంతో నేటి నుంచి పట్టణాల్లో ప్రచారం జోరందుకోనుంది. మొత్తం 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం అసలు లెక్క తేలనుంది. కాగా ప్రధాన పార్టీల నుంచి చాలా మంది నామినేషన్లు వేశారు. దీంతో బీ ఫామ్ (B Form) రాని వారు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ టికెట్ రాకుంటే.. రెబల్‌గా పోటీ చేయడానికి సైతం పలువురు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.