అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సంగీత్‌నగర్(Sangeetnagar)లో 11 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన ఆగస్టు 18 వెలుగులోకి రాగా.. కేసు మిస్టరీ వీడింది. బాలికను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) మునిపల్లి మండలం ముత్తా క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి మూడేళ్లుగా కూకట్‌పల్లి(Kukatpally)లో నివాసం ఉంటున్నారు. కాగా.. కృష్ణ బైక్ మెకానిక్‌గా, రేణుక ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. సహస్ర బోయిన్‌పల్లిలోని కేంద్రీయ విద్యాలయలో ఆరో తరగతి చదువుతోంది.
ఆగస్టు 18న ఉదయం, తల్లిదండ్రులు ఎప్పటిలాగే తమ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో కృష్ణ ఇంటికి వచ్చి చూసేసరికి సహస్ర రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె శరీరంపై సుమారు 20 కత్తి పోట్లు ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కూకట్‌పల్లి పోలీసులు(Kukatpally Police) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు.
కేసు విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, ఫింగర్‌ప్రింట్‌లు, సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. హత్యకు చిన్న, పదునైన కత్తి ఉపయోగించినట్లు అనుమానించారు. విచారణ ముమ్మరం చేసిన పోలీసులు సహస్ర ఇంటి పక్కనే ఉండే భవనంలో నివసిస్తున్న పదో తరగతి విద్యార్థిని నిందితుడిగా గుర్తించారు. విచారణలో బాలుడు దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. సహస్ర ఇంట్లో ఉండడంతో ఆమె అరిచే అవకాశం ఉందని భయపడి, గొంతు నులిమి, తర్వాత కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది.