అక్షరటుడే, వెబ్‌డెస్క్: Case on Kaushik Reddy | పోలీస్ కమిషనర్‌ను (Police Commissioner) హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మతం పేరుతో దూషించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126 (2), 132, 196, 299 బీఎన్ఎస్ సెక్షన్లతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై కేసు పెట్టారు.
తన నియోజకవర్గంలోని వీణవంకలో జరుగుతున్న మినీ మేడారం జాతరకు (Mini Medaram Jathara) పాడి కౌశిక్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. ఆయన తన అనుచరులతో భారీగా వెళ్లారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. నాలుగు కార్లతో మాత్రమే వెళ్లడానికి అనుమతించారు. దీంతో పాడి కౌశిక్‌రెడ్డి తన భార్య, బిడ్డలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరగ్గా.. సీపీని మతం పేరుతో దూషించారు. రాబోయేది బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వమన్నారు. తనను అడ్డుకుంటే సంగతి చెబుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
Case on Kaushik Reddy | విబేధాలు ఉండడంతో..
కౌశిక్‌రెడ్డి అనంతరం మినీ మేడారం జాతరకు వెళ్లారు. అక్కడ సర్పంచ్‌తో కొబ్బరికాయ కొట్టించేందుకు యత్నించారు. అయితే ఆయనను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో మరోసారి ఆయన పోలీసులతో వాగ్వాదం చేశారు. దీంతో ఎమ్మెల్యేను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. కాగా జాతర నిర్వాహకులకు, కౌశిక్‌రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో ఆయన వస్తే ఘర్షణ జరుగుతుందని పోలీసులు భావించినట్లు సమాచారం.
Case on Kaushik Reddy | మా తాత పేరు చెప్పుకోవద్దు
వీణవంక (Veena Vanka) మినీ మేడారం జాతరపై నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. 1976లో పాడి సుధాకర్‌రెడ్డి జాతర ప్రారంభించారని ఉదయనందన్‌రెడ్డి తెలిపారు. 50 ఏళ్లుగా జాతరను తమ కుటుంబమే నిర్వహిస్తోందన్నారు. కౌశిక్ రెడ్డి కావాలనే గొడవ చేశారని ఆరోపించారు. కోర్టు ఆర్డర్‌ను పోలీసులు అనుసరించారన్నారు. పాడి సుధాకర్‌రెడ్డి పేరును కౌశిక్ చెప్పుకోవద్దన్నారు. కౌశిక్ తాత రఘుపతిరెడ్డి అని, ఆయన పేరే చెప్పుకోవాలని సూచించారు. తమ తాత పేరు చెబితే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.