అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Medaram Jathara 2026 |మేడారం మహా జాతర ఘనంగా కొనసాగుతోంది. లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం తరలి వస్తున్నారు. దీంతో వనమంతా జన సందడి నెలకొంది.
మేడారం జాతర గురువారం రెండో రోజు కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy), అడ్లూరి లక్ష్మణ్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. స్వయంగా బైక్‌పై పలు ప్రాంతాలకు వెళ్లి భక్తులతో మాట్లాడారు. అన్ని ఏర్పాట్లతో మేడారం మహా జాతర సజావుగా కొనసాగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) జాతరను నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన అన్నారు.
Medaram Jathara 2026 |సకాలంలో వైద్యం అందించాలి
అధికారులతో కలిసి బైక్‌లపై జాతర ఏర్పాట్లను, జంపన్న వాగు వద్ద స్నానపు సౌకర్యాలను, చుట్టుపక్కల ప్రాంతాలలో పారిశుధ్య చర్యలను మంత్రులు పరిశీలించారు. సకాలంలో వైద్య సహాయం అందించాలని, పారిశుధ్యం కట్టుదిట్టంగా పాటించాలని, వ్యర్థాలను నిరంతరం తొలగించాలన్నారు. ముఖ్యంగా గద్దెల సమీపంలో పరిశుభ్రత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
Medaram Jathara 2026 | గద్దెపై కొలువు తీరిన సారలమ్మ
తొలిరోజు బుధవారం రాత్రి సారలమ్మ కన్నెపల్లి (Kannepalli) నుంచి మేడారంలో గద్దెపై కొలువుదీరారు. కన్నెపల్లి లో మంత్రులు సీతక్క (Minister Seethakka), అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ దివాకర ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క దేవతల పూజారులు సిద్ధబోయిన వారి ఇంటికి చేరి సంప్రదాయ కార్యక్రమాలు చేపట్టగా, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల దేవతను కన్నెపల్లికి తీసుకువచ్చారు. అక్కడ సారలమ్మకు పూజలు చేశారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ రాత్రి 12:30 గంటల ప్రాంతంలో గద్దెపైకి కొలువుదీరారు. అమ్మవారికి భక్తులు ఘన స్వాగతం పలికారు.
