అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medaram Jathara | మేడారం (Medaram) మహా జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తాత్కాలిక బస్టాండ్‌ను శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు.
చారిత్రాత్మక గిరిజన పండుగ కోసం రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా బస్టాండ్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం మొత్తం 4 వేల స్పెషల్ బస్సులు నడపనున్నారు. అవసరం అయితే మరిన్ని బస్సులు నడుపుతామని మంత్రి తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు సేవలు అందించనున్నాయి. గద్దెల సమీపంలోకి సురక్షితమైన, ఇబ్బందులు లేని ప్రయాణం కోసం భక్తులు ఆర్టీసీ బస్సులను ఎంచుకోవాలని మంత్రి కోరారు. పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
Medaram Jathara | శాశ్వత బస్టాండ్ నిర్మిస్తాం
మేడారంలో శాశ్వత బస్టాండ్ నిర్మాణం చేపడుతామని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. ములుగు జిల్లాకు రూ.5 కోట్లతో బస్ డిపో మంజూరు చేస్తామన్నారు. ఏటూరు నాగారంలో రూ.7 కోట్ల ఆర్టీసీ బస్ డిపోకు ఆమోదం తెలిపారు. మంగపేట, ములుగు ఇతర మండలాల్లో మినీ బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బస్టాండ్‌లో భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీంతో బస్సుల్లో ఒక్కసారిగా దూసుకెళ్లే అవకాశం ఉండొదు.
Medaram Jathara | మహిళా శక్తి స్టాళ్లు
ప్రభుత్వం మేడారం మహా జాతరను మహిళలకు జీవనోపాధి కల్పించే వేదికగా మార్చింది. రూ.6 కోట్ల పెట్టుబడితో 565 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లు ఏర్పాటు చేసింది. 37 ప్రదేశాలలో స్టాళ్లు విస్తరించి ఉన్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు ఆహారం, కిరాణా, చిరుధాన్యాల ఉత్పత్తులు, నూనెలు, స్నాక్స్, పూజా సామగ్రి, బేకరీ ఉత్పత్తులు, వస్త్రాలు, చేతివృత్తుల వస్తువులు, స్థానిక ఉత్పత్తుల స్టాళ్లను నడుపుతున్నారు.
