అక్షరటుడే, వెబ్‌డెస్క్: Metro Rail | హైదరాబాద్ మెట్రో రైలును (Hyderabad Metro Rail) ఎల్&టీ నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు (Telangana Chief Secretary Ramakrishna Rao) ఆదేశించారు. కమిటీ కార్యదర్శులు, ఎల్&టి అధికారులతో (L&T officials) మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
స్వాధీన ప్రక్రియ తాజా స్థితిని సమీక్షించిన ప్రధాన కార్యదర్శి, ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా ఈ బదిలీ ప్రక్రియను సజావుగా, వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ ప్రక్రియ కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. స్వాధీన ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుగా, లావాదేవీల సలహాదారు అయిన ఐడీబీఐ తన నివేదికను వీలైనంత త్వరగా ఖరారు చేయాలని కోరారు. ఈ ప్రక్రియలో ఎల్&టీ పూర్తి సహకారం అందించాలని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.
Metro Rail | ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
స్వాధీనం పూర్తయిన తర్వాత, కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారు ఎన్.వి.ఎస్. రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎల్&టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ కె.వి.బి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.