అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medaram Jathara 2026 | మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.
మేడారం సమ్మక్క–సారక్క జాతర (Sammakka-Saralamma Jatara) ఈ నెల 28న ప్రారంభమైన విషయం తెలిసిందే. 28న సారలమ్మ గద్దెలపైకి వచ్చారు. 29న సమ్మక్క గద్దెపై కొలువుదీరారు. అమ్మలను దర్శించుకోవడానికి శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనివారం దేవతలు వన ప్రవేశం చేయనుండటంతో జాతర ముగియనుంది. చివరి రోజు అమ్మల దర్శనానికి భారీగా భక్తులు వచ్చారు. దీంతో పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చారు. అమ్మవార్ల దర్శనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. నేడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జాతర ముగింపు కార్యక్రమం చేపట్టనున్నారు.
Medaram Jathara 2026 | భక్తుల ఇబ్బందులు
మేడారం మహా జాతరలో (Medaram Maha Jatara) శుక్రవారం, శనివారం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్షలాది మంది తరలి రావడంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు సైతం సవాల్‌గా మారింది. గురువారం రాత్రి సమ్మక్క ఆగమనం తర్వాత రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు ఆర్టీసీ బస్సులు సైతం అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడ్డారు. గంటల తరబడి ఎదురుచూసినా బస్సులు రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌తో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.
Medaram Jathara 2026 | బస్సులపై దాడులు
బస్సులు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి పలువురు చలిలో బస్సులో కోసం గంటల తరబడి నిరీక్షించారు. శనివారం సైతం రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో భక్తులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో పలువురు భక్తులు బస్సులపై దాడులు చేశారు. అద్దాలు పగులకొట్టారు.