అక్షరటుడే, వెబ్డెస్క్: Medaram Jathara | మేడారం మహాజాతర మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సామ్మక్క–సారలమ్మ (Sammakka and Saralamma) గద్దెలపై కొలువు దీరనున్నారు. వన దేవతల దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు సాగనున్న మేడారం జాతర కోసం ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే భక్తులు భారీ ఎత్తున గిరిజన దేవతల దర్శనానికి తరలివస్తున్నారు. జాతర సమయంలో కోట్లాది మంది అమ్మవార్లను దర్శించుకోనున్నారు.
గిరిజనుల ఆధ్యాత్మిక గౌరవానికి ప్రతీకైన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ముస్తాబైంది. నాలుగు రోజులు పాటు సాగనున్న మహా జాతరలో తొలి రోజు గద్దెలపై సారలమ్మ కొలువదీరుతారు. 29న సమ్మక్క గద్దెలపైకి వస్తారు 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 31న దేవతలు తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. మహా జాతరకు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
Medaram Jathara | 42 వేల మంది సిబ్బంది
మేడారం మహా జాతర (Medaram Maha Jatara) సందర్భంగా 21 విభాగాలకు చెందిన 42,027 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. వీరికి అదనంగా రెండు వేల మంది ఆదివాసీ వలంటీర్లు సేవలు అందిస్తారు. జాతర జరిగే ప్రాంతాన్ని మొత్తం 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించారు. భక్తుల కోసం 27 శాశ్వత, 33 తాత్కాలిక మొబైల్ టవర్లు ఏర్పాటు చేశారు.
Medaram Jathara | 42 పార్కింగ్ ప్రాంతాలు
జాతరకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం 42 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. వీటి కోసం ఏకంగా 1,418 ఎకరాలు కేటాయించారు. 4 వేల ఆర్టీసీ బస్సులు జాతర సందర్భంగా 51 వేల ట్రిప్పులు నడవనున్నాయి. 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. భక్తుల కోసం 5,482 తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వద్ద 119 డ్రెస్సింగ్ రూమ్లు, 5,700 మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 5 వేల మంది పారిశుధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో పని చేయనున్నారు. అలాగే 5,192 మంది వైద్య సిబ్బంది జాతరలో విధులు నిర్వహించనున్నారు. 210 మంది గజ ఈతగాళ్లు, 100 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.