అక్షరటుడే, వెబ్‌డెస్క్: Womens T20 Match | శ్రీలంక మహిళల పర్యటనలో భాగంగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు మరోసారి తమ సత్తా చాటింది. ఆదివారం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Greenfield International Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు 30 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.
ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 4-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళల జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.
Womens T20 Match | వరుస విజయాలు..
భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు షఫాలీ వర్మ (Shafali Verma), స్మృతి మంధాన అద్భుత ప్రదర్శనతో రికార్డుల మోత మోగించారు. తొలి వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్గా నిలిచారు. గతంలో వెస్టిండీస్‌పై నెలకొల్పిన 143 పరుగుల రికార్డును వీరిద్దరూ బద్దలు కొట్టారు. షఫాలీ వర్మ46 బంతుల్లో 79 పరుగులు (12 ఫోర్లు, ఒక సిక్స్) చేయగా, స్మృతి మంధాన (Smriti Mandhana) 48 బంతుల్లో 80 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించింది. షఫాలీకి ఇది ఈ సిరీస్‌లో వరుసగా మూడో అర్ధశతకం కావడం విశేషం. చివర్లో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్‌తో 16 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేసింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు (Sri Lanka Team) 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు హసిని పెరేరా (33), చమరి అతపత్తు (52) శుభారంభం అందించినప్పటికీ, మధ్య ఓవర్లలో వికెట్లు పడటంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి కీలక సమయంలో వికెట్లు తీసి లంక పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. ఫీల్డింగ్ సమయంలో స్మృతి మంధానకు స్వల్ప గాయం అయినప్పటికీ, అది జట్టు విజయంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, ఇప్పుడు చివరి మ్యాచ్‌లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.