అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఒడిదుడుకులకు లోనయ్యింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 20 పాయింట్లు, నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయాయి.
ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, ముడి చమురు (Crude Oil) ధరలు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీల కారణంగా కొంత ఒత్తిడి కనిపించింది. అయితే రూపాయి విలువ స్వల్పంగా బలపడడంతో మార్కెట్‌పై అమ్మకాల ఒత్తిడి తగ్గి ఇంట్రాడే కనిష్టాలనుంచి కోలుకున్నాయి. ఆటో, మెటల్ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 95 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 130 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాల నుంచి 336 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 2 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 62 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 98 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టంతో 854,675 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 25,938 వద్ద స్థిరపడ్డాయి.భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి గతనెలలో రెండేళ్ల గరిష్ట స్థాయి అయిన 6.7 శాతంగా నమోదయ్యింది. జీఎస్టీ రేట్లను తగ్గించిన తర్వాత ఆర్డర్లు పెరగడం వల్ల మైనింగ్, తయారీలో బలమైన పనితీరు కనిపించింది. బలహీనమైన గ్రీన్బ్యాక్, బలమైన ఐఐపీ డాటా కారణంగా రూపాయి విలువ స్వల్పంగా బలపడిరది.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,918 కంపెనీలు లాభపడగా 2,260 స్టాక్స్ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 108 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 195 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో ర్యాలీ..
బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 1.95 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.81 శాతం, ఆటో 1.03 శాతం, కమోడిటీ 0.65 శాతం, పీఎస్‌యూ 0.40 శాతం పెరిగాయి. కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.81 శాతం, ఐటీ(IT) ఇండెక్స్ 0.77 శాతం, రియాలిటీ 0.74 శాతం, క్యాపిటల్ గూడ్ 0.45 శాతం, హెల్త్‌కేర్ 0.39 శాతం, ఎనర్జీ 0.32 శాతం నష్టపోయాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.03 శాతం లాభంతో ముగియగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం నష్టంతో ముగిశాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభపడగా.. 17 కంపెనీలు నష్టపోయాయి. టాటా స్టీల్ 2.03 శాతం, ఎంఅండ్ఎం 2 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 1.66 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.13 శాతం, ఎస్బీఐ 0.88 శాతం పెరిగాయి.
Top Losers : ఎటర్నల్ 2.10 శాతం, ఇండిగో 1.37 శాతం, ఇన్ఫోసిస్ 1.28 శాతం, ఆసియా పెయింట్ 1.09 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.84 శాతం నష్టపోయాయి.