అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kota Srinivasa Rao | తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఒకరు. మొదట చిన్న చిన్న పాత్రలతో నటన ప్రారంభించిన ఆయన ఆ తర్వాత తన అద్భుత ప్రతిభతో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అనేక విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 90వ దశకంలో బాబు మోహన్ – కోట శ్రీనివాసరావు కలసి తెరపై కనిపించారంటే చాలు, ఆ సినిమా హిట్ అనుకునేవారు. వారి జోడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది. నిజంగానే ఆ కాంబినేషన్‌కి అప్పట్లో అద్భుతమైన క్రేజ్ ఉండేది. వారి హాస్య సన్నివేశాలు ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సంపాదిస్తున్నాయి.
Kota Srinivasa Rao | ఇద్దరికీ ఒకేలా..
తెరపై ప్రేక్షకులకు నవ్వులు పంచిన కోట గారి జీవితంలో ఒక విషాదకర మలుపు చోటుచేసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం, ఆయన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన కోట గారిని తీవ్రంగా కుంగదీసింది. ఆ విషాదం తర్వాత ఆయన మానసికంగా కుంగిపోయారు. సినిమాలపై ఆసక్తి కూడా తగ్గింది. అదే సమయంలో ఆరోగ్య సమస్యలూ రావడంతో కోట గారు కొంతకాలం సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఓ సమయంలో ఈటీవీలో ప్రసారమైన ‘ఆలీతో సరదాగా’ షోలో తన స్నేహితుడు బాబు మోహన్ (Babu Mohan) తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఫేమస్ డైలాగ్ డెలివరీతో మళ్లీ ప్రేక్షకులను అలరించారు.
సినిమా ఇండస్ట్రీలో కోట, బాబు మోహన్‌లు ప్రాణ స్నేహితులు మాదిరిగా ఉంటారు. రోడ్డు ప్రమాదంలో కోట తనయుడు కన్నుమూయగా, అదే మాదిరిగా బాబు మోహన్ తనయుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. ఇక శ్రీనివాసరావు లేరనే వార్తతో బాబు మోహన్ కన్నీరు మున్నీరుగా విలపించారు. కోటకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కోట అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మహా ప్రస్థానంలో జరగనున్నట్టు తెలుస్తుంది.