అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అమలుకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది.
ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శనివారం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి అందజేశారు. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. సీఎం మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో మార్పులు, చేర్పులు చేసి శనివారం సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Local Body Elections | ఎన్నికల సన్నద్ధతపై సమావేశం
ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ జితేందర్‌తో భేటీ, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. ఎన్నికల సన్నద్ధతపై ఆమె చర్చించనున్నారు. రాష్ట్రంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలపై చర్చించనున్నారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తదితర అంశాలను అధికారులు ఎన్నికల సంఘానికి వివరించనున్నరు. అనంతరం ఎన్నికల సంఘం(Election Commission) స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది.
Local Body Elections | జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు
జెడ్పీలు , ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాల వారీగా కూడా రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఏయే స్థానాలు ఏ సామాజికవర్గానికి కేటాయిస్తారన్న దానిపై ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులు తహతహలాడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించనున్న రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితాలను సిద్ధం చేసిన ఈసీ.. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Local Body Elections | మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ!
రాష్ట్రంలోని 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జెడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కలెక్టర్లకు అప్పగించింది. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. జనాభా, సామాజికవర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వానికి కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు.
కలెక్టర్ల నివేదికల ఆధారంగా జెడ్పీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు రిజర్వేషన్లను సర్కారు ఖరారు చేసింది. ప్రభుత్వం మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.