అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kancha Gachibowli | హైదరాబాద్(Hyderabad) నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ భూములు తమవే అని నిజాం వారసులు అంటున్నారు.
నగరంలోని కంచ గచ్చబౌలి(Kancha Gachibowli)లో 400 ఎకరాల భూమిని చదును చేసి వేలం ద్వారా విక్రయించాలని గతంలో ప్రభుత్వం చూసిన విషయం తెలిసిందే. అయితే ఈ భూములు హెచ్‌సీయూ(HCU)కు చెందినవని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నగరంలో అటవీ భూములను చదును చేసి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని పలువురు కోర్టులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు భూములను చదును చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భూముల వ్యవహారంలో స్టే విధించింది. అక్కడ ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సూచించింది. అయితే తాజాగా నిజాం వారసులు ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చారు.
Kancha Gachibowli | ప్రభుత్వానికి నోటీసులు
కంచ గచ్చిబౌలిలోని 2,725 ఎకరాల భూములపై యాజమాన్య హక్కులు తమకే ఉన్నాయని నిజాం వారసులు అంటున్నారు. ఈ మేరకు వారు సోమవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్(Hyderabad Press Club)లో విలేకరులతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేశామని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్(Telangana Government)కు లీగల్ నోటీసులు జారీ చేశామని అసఫ్ జాహీ వారసులు తెలిపారు. 2,725 ఎకరాల 23 గుంటల భూమికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యజమాని అని వారు చెబుతున్నారు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.