అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kite Festival | హైదరాబాద్ నగరంలో (Hyderabad City) ప్రతి ఏటా కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ‘ఇంటర్నేషనల్ కైట్స్ (International Kites) అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్’ను పర్యాటక, సాంస్కృతిక శాఖ నిర్వహించనుంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ వేడుకలకు వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా అంతర్జాతీయ పతంగుల ఆటగాళ్లు(కైట్ ఫ్లైయర్స్) హాజరు కానున్నారు. పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 13 నుంచి 15 వరకు కైట్ ఫెస్టివల్ (Kite Festival) జరగనుంది. అయితే హైడ్రా ఆధ్వర్యంలో నగరంలోని పలు చెరువుల వద్ద ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు.
Kite Festival | చెరువుల ముస్తాబు
హైడ్రా (HYDRAA) నగరంలోని పలు చెరువులను పునరుద్ధరించింది. మాదాపూర్‌లోని తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, పాతబస్తీలోని బమ్-రుక్న్ – ఉద్ – దౌలా చెరువులు ఇప్పుడు కైట్ ఫెస్టివల్‌కు వేదికలయ్యాయి. ఆక్రమణలకు గురై ఆనవాళ్లు కోల్పోయిన చెరువులకు పూర్వవైభవం తెచ్చిన హైడ్రా ప్రస్తుతం అక్కడ కైట్ ఫెస్టివల్ నిర్వహించడానికి సిద్ధమైంది. ఆయా చెరువులు గతంలో ఆక్రమణలకు గురై మురికి కూపాలుగా మారాయి. వాటిలో పూడిక తొలగించి పునరుద్దరించారు. చెరువు పరిసరాలను సైతం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు, ఉప్పల్‌లోని నల్లచెరువు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి.