అక్షరటుడే, ఇందల్వాయి: Rural Mla Bhupathi reddy | అర్గుల్ (Argul) గ్రామంలో చాకలి ఐలమ్మ (Chakali Ilamma) విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. జక్రాన్పల్లిలో (jakranpally) మండలంలోని అర్గుల్లో గురువారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా భావితరాలకు స్ఫూర్తి పొందుతారన్నారు. విగ్రహం ఏర్పాటునకు కృషి చేసిన రజక సంఘానికి అభినందనలు తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం ఇస్తుందని, కేంద్రం మాత్రం బీసీల పట్ల వ్యతిరేకంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బీసీల కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM revanth Reddy) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరిగిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం బిల్లు ఆమోదించామని, గవర్నర్ ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బీజేపీని ప్రభుత్వం ఎప్పటికీ నమ్మవద్దని సూచించారు.
అర్గుల్ గ్రామంలో ఎస్సీ వాడకు రూ.20 లక్షల నిధులతో సీసీ రోడ్డు కోసం శంకుస్థాపన చేశారు. ప్రాథమిక సహకార సంఘం గోదాం నిర్మాణం కోసం రూ.20లక్షల నిధులతో శంకుస్థాపన చేశామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.
అలాగే ప్రాథమిక ఆరోగ్య సెంటర్ భవనం (PHC) నిర్మాణం కోసం రూ.20 లక్షల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఇప్పటివరకు అర్గుల్ గ్రామానికి రూ. కోటికి పైగా నిధులు కేటాయించానని గుర్తు చేశారు.
కార్యక్రమంలో చాకలి ఐలమ్మ ముని మనుమరాలు శ్వేత ఐలమ్మ, సభ అధ్యక్షుడు నిమ్మగిరి విద్యా సాగర్, ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ ఐసీబీఎంఎస్ ఛైర్మన్ సాయారెడ్డి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గుపన్ పల్లి శంకర్, గ్రామ కమిటీ సభ్యుడు రజక సుదర్శన్, రజక సంఘ సభ్యులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
