అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | పార్కులు, రోడ్ల కబ్జాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. శుక్రవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండలంలోని (Kukatpally Mandal) గోపాల్నగర్లో 3300 గజాల పార్కును కాపాడింది.
గోపాల్నగర్లోని (Gopalnagar) 148 నుంచి 155 వరకూ ఉన్న సర్వే నంబర్లలో 92.21 ఎకరాల మేర గోపాలనగర్ పేరిట లే ఔట్ వేశారు. 1980లో వేసిన ఈ లే ఔట్లో 1200లకు పైగా ప్లాట్లున్నాయి. ఇందులో పార్కులకోసం 3 చోట్ల భూమిని అప్పట్లో వదిలేశారు. రెండు చోట్ల పార్కు స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. మూడో పార్కుపై సైతం కొందరు కన్ను వేశారు. దీంతో పార్కు కబ్జాలకు గురవుతోందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
Hydraa | ఆక్రమణల తొలగింపు
హైడ్రా అధికారులు (Hydraa Officers) జీహెచ్ఎంసీ (GHMC), రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కు స్థలం కబ్జా అవుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు పార్కులో వేసిన షెడ్డును శుక్రవారం తొలగించారు. పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. పార్కు స్థలాన్ని కాపాడడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గోపాల్నగర్లో పార్కులను కాపాడాలని సంబంధిత శాఖలకు అనేక సంవత్సరాలు విన్నపాలు చేశామన్నారు. కానీ ఎవరు పట్టించుకోలేదని చెప్పారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే.. పార్కును కాపాడుతూ ఫెన్సింగ్ వేశారని చెప్పారు.