అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) పలు చెరువులకు హైడ్రా ప్రాణం పోస్తోంది. బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెచ్చింది. కూకట్పల్లి నల్ల చెరువును (Kukatpally Nalla Cheruvu) అభివృద్ధి చేస్తోంది. అలాగే పాతబస్తీలోని పురాతన చెరువుకు ప్రాణం పోసింది.
ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోయిన బమ్రుక్న్ ఉద్దౌలా చెరువును (Bum-Rukn-ud-Daula lake) పునరుద్ధరించింది. పాతబస్తీకే మణిహారంగా ఈ చెరువును తీర్చిదిద్దుతోంది. జనవరిలో ఈ చెరువును ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పనులను పరిశీలించారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువుకు స్థానికులు సులభంగా చేరుకునేలా రహదారులతో పాటు ప్రవేశ ద్వారాలుండాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్పై వాకింగ్ ట్రాక్లను, చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేస్తున్న ప్లే ఏరియాలను పరిశీలించారు.
Hydraa | విహార కేంద్రంగా తీర్చిదిద్దాలి
బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఔషధ గుణాలున్న చెట్లతో పాటు మొక్కలను చెరువు చుట్టూ నాటాలని సూచించారు. నిజాంల కాలంలో చెరువు నిర్మాణంలో వాడిన రాతిని వినియోగించి కట్టడాన్ని పటిష్టం చేయాలని ఆయన సూచించారు. ఇన్లెట్లు, ఔట్లెట్లు విశాలంగా ఉండేలా చేపట్టిన నిర్మాణాలను చూశారు.
నిజాంల కాలంలో 104 ఎకరాల మేర ఈ చెరువు విస్తరించి ఉండేది. కాల క్రమంలో 17.05 ఎకరాలుగా హెచ్ఎండీఏ నిర్ధారించింది. అయితే అందులో చాలా వరకు ఆక్రమణలకు గురైంది. చివరికి 4.12 ఎకరాలుగా మిగిలిపోయింది. అయితే హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించి చెరువును అభివృద్ధి చేస్తున్నారు.