అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఇటీవల కురిసిన కుండపోత వర్షాలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. పలుచోట్ల రోడ్లు ధ్వంసం కాగా, కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా.. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్లో సైతం చెరువు కట్ట తెగిపోయింది.. ఫీడర్ కాల్వలు కొట్టుకుపోయాయి. దీంతో మరమ్మతులు చేయించాలని రైతులు విన్నవించారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో అన్నదాతలు ఏకమయ్యారు. తామే పనులు చేసుకునేందుకు నడుం బిగించారు. సొంతఖర్చులతో శ్రమదానం చేసి కట్టను బాగు చేసుకున్నారు.
తిమ్మాపూర్ (Timmapur) గ్రామంలో రైతులు శ్రమించి రెండురోజుల క్రితం చెరువుకు పడ్డ బుంగను పూడ్చివేశారు. కానీ శుక్రవారం ఉదయం భారీ వర్షం కురవడంతో చెరువు కట్ట మళ్లీ తెగిపోయింది. నీటిని సంరక్షించుకొని పంటలను కాపాడుకునేందుకు చేసిన కష్టాన్ని వరుణుడు నీటిపాలు చేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Yellareddy | నిధులు మంజూరైనా నిష్ఫలమే..
చెరువు కట్ట మరోసారి కొట్టుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంజూరైన నిధులకు టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

