అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rachakonda Police Commissionerate | కొందరు తాము డబ్బులు సంపాదించడానికి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ప్రతి వస్తువును కల్తీ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేస్తుండడంతో వాటిని తింటున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలా కల్తీ ఆహార (adulterated food) ఉత్పత్తులు తయారు చేస్తున్న వారిపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కీలక విషయాలు గుర్తించి 52 మందిని అరెస్ట్ చేశారు.
రాచకొండ పోలీస్ కమిషరేట్ (Rachakonda Police Commissionerate) పరిధిలో అక్రమ, రియు అపరిశుభ్రమైన ఆహార తయారీ యూనిట్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ (ginger garlic paste) నుంచి మొదలు పెడితే నెయ్యి, పనీర్ కూడా కల్తీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 46 కేసులు నమోదు చేసి 52 మందిని అరెస్టు చేశారు. సీపీ సుదీర్‌బాబు ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్ బృందాలు (Special operation teams) ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
Rachakonda Police Commissionerate | నకిలీ లేబుళ్లతో విక్రయాలు
FSSAI, వాణిజ్య లైసెన్సులు (commercial licenses) లేకుండా పనిచేస్తున్న అనేక ఆహార యూనిట్లను పోలీసులు గుర్తించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పనీర్ ఇతర ఆహార పదార్థాలు అపరిశుభ్రమైన ప్రాంతాల్లో తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని నకిలీ లేబుళ్లతో విక్రయిస్తున్నారు. భువనగిరి డివిజన్లో 35 కిలోల కల్తీ పనీర్ (adulterated paneer), 250 కిలోల మిశ్రమ వస్తువులు స్వాధీనం చేసుకొని 18 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. అలాగే ఎల్బీ నగర్లో 11 కేసులు నమోదు చేశారు. 575 లీటర్ల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరంలో 3,946 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌గిరిలో రూ.10 లక్షల విలువైన రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులు స్వాధీనం చేసుకొని, 9 కేసులు నమోదు చేశారు.