అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cold Wave | తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రెండు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ (Telangana) లోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదు అవుతోంది. ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. దీంతో చలితో ప్రజలు వణికి పోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం పది గంటల వరకు కూడా చలితీవ్రత అధికంగా ఉంటుంది. సాయంత్రం 5 కాగానే చలి మొదలు అవుతోంది. మధ్యాహ్నం సైతం చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Cold Wave | కనిష్ట ఉష్ణోగ్రతల వివరాలు
తెలంగాణలోని ఆసిఫాబాద్‌లో గురువారం తెల్లవారుజామున అత్యల్పంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సంగారెడ్డిలో 6.4, రంగారెడ్డిలో 6.5, ఆదిలాబాద్ 7.7, వికారాబాద్ 8.1, సిద్దిపేట 8.1, మెదక్ 8.5, కామారెడ్డి (Kamareddy) 8.6, నిర్మల్ 8.9, నిజామాబాద్ 9.1, నాగర్‌కర్నూల్ 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. చలితీవ్రతతో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు వణికి పోతున్నారు. అక్కడ తీవ్రత మరింత అధికంగా ఉంది. గురువారం రాత్రి నుంచి చలి మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Cold Wave | ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో సైతం చలి తీవ్రత అధికంగా ఉంది. అల్లూరి జిల్లాలో సింగల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, పాడేరు, ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు (Temperatures) పడిపోవడంతో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వెచ్చని దుస్తులు ధరించాలని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.