అక్షరటుడే, ఇందూరు: National Handloom Day | చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal ) అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) పురస్కరించుకొని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నగరంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేతరంగం ప్రధాన భూమిక పోషించి, అహింసా ఉద్యమానికి నాంది పలికిందన్నారు.
1905 ఆగస్టు 7న విదేశీ వస్తువుల బహిష్కరణలో (foreign goods) కీలకపాత్ర పోషించిన రోజును జాతీయ చేనేత దినంగా ప్రకటించాలన్న తెలంగాణ బిడ్డ రాహుల్ ఆనంద భాస్కర్ ప్రతివాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఇది చేనేత రంగానికి దక్కిన గౌరవం అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకం (Vishwakarma Yojana Scheme) కింద వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తూ రుణాలు అందిస్తూ చేతివృత్తుల వారిని ఆదుకుంటుందన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించైనా చేనేత కార్మికుల వలసలు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చేనేత కార్మికుల జీవనం మాత్రం మారడం లేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల (Bathukamma saree) పంపిణీలో దోపిడీకి తెరలేపి కార్మికులకు మొండిచేయి చూపెట్టారని విమర్శించారు. అనంతరం చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, సత్యపాల్, ప్రసాద్, విజయలక్ష్మి, బీజేపీ నాయకులు కిషోర్, నాగరాజు, బొట్టు వెంకటేష్, పల్నాటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.