అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Meeting | రెండు రోజులే అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రభుత్వం పారిపోవాలని చూస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సంతాపం తెలిపి సభను రేపటికి వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం బీఏసీ సమావేశం నిర్వహించారు. అయితే వరదలు, ఎరువులపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మీటింగ్ నుంచి బీఆర్ఎస్ (BRS) వాకౌట్ చేసింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు.
Assembly Meeting | వరదల గురించి వద్దంటా..
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని హరీశ్‌రావు అన్నారు. వరదల గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే ప్రభుత్వం అంగీకరించడం లేదని.. బురద రాజకీయాల గురించి మాట్లాడుదాం అంటోందని వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ సిటీ (Fourth City)లో ముఖ్యమంత్రి కుటుంబం పాత్ర, ధాన్యం కుంభకోణం, ప్రభుత్వ ఉద్యోగుల టీఏ, డీఏలు, గోదావరి, బనకచర్లపై మరికొన్ని అంశాలపై చర్చించాలని కోరినట్లు హరీశ్‌రావు తెలిపారు.
Assembly Meeting | రైతులు గోస పడుతున్నారు
యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి అన్నారు. సభలో ఎరువుల మీద మాట్లాడుదామంటే మెల్లగా మాట్లాడుదాం తొందర ఏముంది అంటున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా లేక రైతులు అవస్థలు పడుతుంటే. కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పుకొని తప్పించుకుంటున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాలు ఆడి రైతులను గోస పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎరువుల కొరత, గ్రామాల్లో పారిశుధ్యం, గురుకులాల్లో పిల్లలు అనారోగ్యాలపై మాట్లాడాలని కోరితే ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు.