అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kokapet Lands | హైదరాబాద్ నగరంలోని కోకాపేట భూములు కోట్లు పలుకుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధం అయింది.కోకాపేటలోని నియోపాలిస్ లే అవుట్ (Neapolis Layout)లో ఇటీవల ప్రభుత్వం మూడు దశల్లో వేలంపాట నిర్వహించిన విషయం తెలిసిందే.
మొత్తం 27 ఎకరాలను విక్రయించగా ప్రభుత్వానికి రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో మరోసారి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నియోపోలిస్ లేఔట్‌ను ఆనుకుని 70 ఎకరాలను వేలం వేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఈ వేలం ప్రక్రియ ద్వారా రూ.800 కోట్లు ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Kokapet Lands | సంక్షేమ పథకాలకు..
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అవసరం. ఇటీవల పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రక్రియ ముగిసింది. గత సర్పంచులు చేసిన బిల్లులు ఇప్పటికీ రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు కొలువదీరడంతో గ్రామంలో అత్యవసర పనులు చేపట్టాల్సి ఉంటుంది. వాటికి డబ్బులు కావాలి. అలాగే యాసంగి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. ఎకరాకు రూ.6 వేల చొప్పున యాసంగి రైతు భరోసా (Rythu Bharosa) జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పలు పథకాలకు డబ్బులు అవసరం కావడంతో భూముల వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Kokapet Lands | గతంలోనే లీజుకు..
ప్రస్తుతం వేలం వేయాలి అనుకుంటున్న భూములను గతంలో పలు ఐటీ కంపెనీలకు లీజుకు ఇచ్చారు. పదేళ్లు అయిన ఏ కంపెనీ కూడా కార్యకలాపాలు ప్రారంభించలేదు. దీంతో ఆ భూములను వారి నుంచి తీసుకొని వేలం వేయడానికి అధికారులు సిద్ధం అయ్యారు. కోకాపేట భూములకు భారీగా డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) దగ్గరగా ఉంటుంది. సమీపంలో ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్ ఉండటంతో రూ.కోట్లు పెట్టడానికి కూడా కంపెనీలు ఆలోచించడం లేదు. ఈ భూముల వేలం కోసం వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.