అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరినీ మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ(BRS Party)ని ప్రభుత్వం కక్షగట్టిందని, హామీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)కు నోటీసులిచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయ రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుంకుమ పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
MLC Kavitha | హామీల అమలేది?
కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారం కోసం అన్ని వర్గాలకు అనేక హామీలు ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. గద్దెనెక్కాక వాటిని అమలు చేయకుండా మహిళలు, రైతులు, యువకులు అందరినీ మోసం చేసిందని విమర్శించారు. రైతు భరోసా(Rythu Bharosa) సహా అన్ని హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ‘పింఛన్లు పెంచలేదు.. మహిళలందరికీ ఇస్తామన్న రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగ్గొట్టిందన్నారు. వానాకాలం పంట సీజన్ మొదలైంది.. రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికీ రైతుభరోసా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది.. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా.. లేక రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి’ అని కవిత పేర్కొన్నారు.
MLC Kavitha | ప్రశ్నిస్తే కేసులు..
కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కవిత(MLC Kavitha) మండిపడ్డారు. హామీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందన్నారు. మొన్ననే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) పేరుతో కేసీఆర్‌ను విచారణ చేసిందని, ఇవాళ కేటీఆర్‌ను ఏసీబీ(ACB) విచారిస్తోందని తెలిపారు. మేం వేధింపులకు భయపడే వాళ్లం కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్(Telangana Bhavan)కు తాళం వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మా కార్యకర్తలు, నాయకులను బయటికు రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. మా పార్టీ లోపాలను సవరించుకుంటామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు.