HomeతెలంగాణDharani | ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ‘ధరణి’ అక్రమాలపై ఆడిట్​

Dharani | ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ‘ధరణి’ అక్రమాలపై ఆడిట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dharani | ధరణి పోర్టల్ (Dharani Portal)​లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్​ ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram commission) విచారణ పూర్తవగా.. ఫోన్​ ట్యాపింగ్​ (Phone Tapping) కేసులో సిట్​ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరైన ప్రధాన నిందితుడు ప్రభాకర్​ రావును నేడు మరోసారి అధికారులు విచారించనున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో సైతం ఏసీబీ (ACB) సోమవారం కేటీఆర్​ను విచారించింది. తాజాగా ధరణి పోర్టల్​లో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బీఆర్​ఎస్​ ముఖ్య నాయకుల చుట్టూ ఉచ్చు బిగించేలా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

Dharani | ఫోరెన్సిక్​ ఆడిట్​

బీఆర్​ఎస్​ హయాంలో భూముల రిజిస్ట్రేషన్​ కోసం ధరణి పోర్టల్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తహశీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్​ బాధ్యతలు అప్పగించారు. అయితే ధరణి పోర్టల్​ తీసుకొచ్చే క్రమంలో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది. అంతేగాకుండా దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. భూ సమస్యలు పరిష్కారం కాక.. కార్యాలయాల చుట్టూ తిరిగారు. దీంతో ధరణి స్థానంలో కాంగ్రెస్​ భూ భారతి (Bhu Bharati) పోర్టల్​ను తీసుకొచ్చింది. అయితే ధరణిలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఫోరెన్సిక్​ ఆడిట్​ ప్రారంభించింది. ఈ బాధ్యతలను కేరళ (Kerala) ప్రభుత్వ సంస్థ KSAACకి అప్పగించడం గమనార్హం.

Dharani | మొదట ఆ జిల్లాల్లోనే..

ధరణి పోర్టల్​ను అనుకూలంగా మార్చుకొని కొందరు వేల ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుట్టలు, కొండలను కూడా రిజిస్ట్రేషన్​ చేసుకొని రైతుబందు పొందారు. అంతేగాకుండా నిషేధిత భూములను కూడా పట్టా చేసుకున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేపట్టనున్నారు. కేటీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, హరీశ్​రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట జిల్లాల్లో మొదట కేఎస్​ఏఏఈ సంస్థ ఆడిట్​ నిర్వహించనుంది. అక్కడ విజయవంతం అయితే మిగతా జిల్లాల్లో ఆడిట్​ చేపట్టనున్నారు. ఆడిట్ కోసం అవసరమైన రికార్డులను సీసీఎల్‌ఏ (CCLA) అధికారులు సంస్థకు అందించినట్లు సమాచారం. 2020 అక్టోబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగిన లావాదేవీలపై ఈ సంస్థ ఆడిట్​ చేయనుంది.

Dharani | నాలుగు నెలల్లో నివేదిక

ధరణి పోర్టల్​లో అక్రమాలపై ఆడిట్​ నిర్వహించి నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. నాలుగు నెలల్లో రెండు జిల్లాల అడిట్ పూర్తి చేయాలని పేర్కొంది. డిసెంబరు నాటికి రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 నుంచి 2023 వరకు లక్షల ఎకరాలు అక్రమంగా చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Dharani | లక్షల ఎకరాలు అన్యాక్రాంతం

2014-23 మధ్య కాలంలో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల అటవీ, దేవాదాయ, వక్ఫ్‌, భూదాన్‌ భూములు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. 22.68 లక్షల ఎకరాల అసైన్డ్​ భూములు కూడా మాయం అయినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. బీఆర్​ఎస్​ హయాంలో భూ రికార్డుల సవరణ చేపట్టకంటే ముందు రాష్ట్రంలో 1.30 కోట్ల ఎకరాల భూమి ఉంటే 2020 అక్టోబరు 23 నాటికి ఈ లెక్క 1.55 కోట్ల ఎకరాలకు చేరింది. ఏకంగా 25 లక్షల ఎకరాల పట్టా భూమి అదనంగా రికార్డు అయింది. ఈ భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ఆడిట్​లో తేల్చనున్నారు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో నిషేధిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కూడా ఫోకస్​ పెట్టనున్నారు.