అక్షరటుడే, వెబ్డెస్క్ : Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై తెలంగాణ(Telangana) ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నాయి. దసరా నాటికి రూ.600 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే దసరా వచ్చినా.. నిధులు రాకపోవడంతో యాజమాన్యాలు తదుపరిపై కార్యాచరణపై చర్చిస్తున్నాయి.
కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement) బకాయిల కోసం ఇటీవల ప్రైవేట్ కాలేజీలు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిధులు విడుదల చేయకపోతే కాలేజీలు బంద్ చేస్తామని ప్రకటించాయి. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కాలేజీల ప్రతినిధులతో మాట్లాడారు. దసరా నాటికి రూ.600 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలేజీల బంద్ నిర్ణయాన్ని అసోసియేషన్ వాయిదా వేసింది.
Fee Reimbursement | నిధులు రాకపోవడంతో..
ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో కాలేజీలు బంద్ చేయాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దసరా తర్వాత విద్యా సంస్థలు తెరవొద్దనే యోచనలో కాలేజీ యాజమాన్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బుధవారం అత్యవసరంగా సమావేశం నిర్వహించి చర్చిస్తున్నారు.
Fee Reimbursement | ఆర్థిక ఇబ్బందుల్లో కాలేజీలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పినట్లు నిధులు విడుదల కాలేదని కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ పేర్కొంది. నిధులు లేక రాష్ట్రవ్యాప్తంగా వందలాది సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పేర్కొంది. మొత్తం బకాయిలు దాదాపు రూ.10 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. గత నాలుగు సంవత్సరాలుగా నిధులు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు కాలేజీ నిర్వహణకు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అసోసియేషన్ తెలిపింది. అయినప్పటికీ ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకున్న యాజమాన్యాలు కనీసం రూ.600 కోట్ల తక్షణ విడుదలకు అంగీకరించాయని చెప్పింది. అయితే ఆ మొత్తం కూడా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై చర్చించడానికి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది.