అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Desk Journalists | డెస్క్ జర్నలిస్ట్‌ల పోరాటం ఫలించింది. జర్నలిస్టులను విభజించేలా అక్రిడిటేషన్ కార్డుల విషయంలో గతంలో తీసుకొచ్చిన జీవోపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఇటీవల కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో డెస్క్ జర్నలిస్ట్‌లకు మీడియా కార్డులు ఇస్తామని, ఫీల్డ్ రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. డెస్క్ జర్నలిస్ట్‌లు అందరు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. జర్నలిస్ట్ సంఘాలు (Journalist Associations) సైతం వారి పోరాటానికి మద్దతు ఇచ్చాయి. ఈ క్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నేతలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) పలుమార్లు చర్చించారు. అనంతరం గతంలో విడుదల చేసిన జీవో 252లో సవరణలు చేస్తూ తాజాగా మరో జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అందరు జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని, మీడియా కార్డులు ఉండవని తెలిపింది. దీంతో డెస్క్ జర్నలిస్ట్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Desk Journalists | తాజా జీవోలో ఏముందంటే..
డెస్క్ జర్నలిస్టులకు జారీ చేసే అక్రిడిటేషన్ కార్డుల్లో తప్పనిసరిగా మహిళలకు 33శాతం జారీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. 2.5 లక్షల సర్క్యులేషన్ పత్రికలకు మండల స్థాయిలో 1.5 లక్షల జనాభా ఉంటే అదనంగా మరొక అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని తెలిపింది. 2.5 లక్షలు ఉన్న పత్రికల్లో స్పోర్ట్స్, కల్చరల్, ఫిలిం విభాగంలో పనిచేసే జర్నలిస్టులకు అదనంగా అక్రిడేషన్ కార్డులు (Accreditation Cards) జారీ చేయాలని పేర్కొంది. రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధి ఒకరు, పెద్ద దినపత్రికల్లో పని చేసే ఒక డెస్క్ జర్నలిస్టుకు అవకాశం కల్పించారు. అయితే డెస్క్ జర్నలిస్ట్‌లకు ఎన్ని కార్డులు ఇస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. యూనిట్ ఉన్న జిల్లాలకు కాకుండా.. అన్ని జిల్లాలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కార్డుల సంఖ్య తగ్గించకుండా గతంలో మాదిరిగా అర్హులందరికీ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని కోరుతున్నారు.