అక్షరటుడే, వెబ్‌డెస్క్: Goods Train | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కదులుతున్న గూడ్స్ రైలు బోగీలు విడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ (Rayadurgam Railway Station) సమీపంలో గురువారం ఉదయం గూడ్స్ రైలు బోగీలు విడిపోయాయి. ఇనుప ఖనిజం లోడ్‌తో గూడ్స్ రైలు కర్ణాటకలోని మంగళూరుకు వెళ్తోంది. అయితే రాయదుర్గం సమీపంలోకి రాగానే రైలు నుంచి పలు బోగీలు విడిపోయాయి. ఈ రైలు మొలకలమూరు (Molakalmuru) నుంచి కర్ణాటకలోని విజయగనరం జిల్లాలో గల జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగో వ్యాగన్ వద్ద బోగీ లింక్ కట్ కావడంతో ఇంజిన్ నుంచి విడిపోయాయి. దీంతో ఇంజిన్ నుంచి విడిపోయాక బోగీలు రెండు కిలోమీటర్లు వెళ్లడం గమనార్హం.
Goods Train | రైళ్లు రాకపోవడంతో..
బోగీలు విడిపోయిన.. ఇంజిన్ అలాగే ముందుకు వెళ్లింది. అయితే బోగీలు పట్టాలపై రెండు కిలోమీటర్లు వెళ్లి ఆగిపోయాయి. ఆ సమయంలో ట్రాక్‌పై ఇతర రైళ్లు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే రైళ్లు ఢీకొనే అవకాశం ఉండేది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు బోగీలకు కనెక్ట్ చేశారు. ఈ ఘటనతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలును పంపిన అనంతరం అధికారులు రాకపోకలను పునరుద్ధరించారు. అయితే బోగీలు విడిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై రైల్వే అధికారులు (Railway Officers) దర్యాప్తు చేస్తున్నారు.