అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మోస్రా (Mosra), చందూర్ (Chandur) మండల కేంద్రాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయాలు, మోస్రాలో జనరల్ ఫంక్షన్ హాల్, చందూర్‌లో జీపీ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో (RTC Free Bus) ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. పెట్రోల్ బంక్‌లు, మహిళా శక్తి క్యాంటీన్లు (Mahila Shakthi Canteens), ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, స్కూల్ యూనిఫామ్‌ల బాధ్యత మహిళలకే అప్పజెప్పామన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతికి బాటలు వేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.
మహిళలు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా వడ్డీలేని రుణాలను అందిస్తోందని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే మహిళా సంఘాలకు రూ.26వేల కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామని వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డులను కూడా మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లో కూడా మహిళా సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించామని వివరించారు.
60 ఏళ్ల వయస్సు దాటిన మహిళలకు స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వం ఉండేది కాదని, తాము అధికారంలోకి వచ్చాక వారికి కూడా సభ్యత్వాలు కల్పిస్తూ ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే వారికి రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణాలను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
Minister Seethakka | ప్రజలకు అందుబాటులో ఉండాలి
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా సమీకృత భవన సముదాయాలు నిర్మించామన్నారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు విస్తృతస్థాయిలో అమలవుతున్నాయని, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలను వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకుంటే ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తోందని, ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా మాఫీ చేస్తోందని వివరించారు.
పోడు పట్టాలను అర్హులకు ఇచ్చామని.. మరికొందరు అర్హులు ఉన్నారని వారికి కూడా అందజేయాలని పోచారం మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ (MP Suresh Shetkar), రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్(Kasula Balraj), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న మంత్రి సీతక్క, సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే పోచారం
సభకు హాజరైన ప్రజలు