అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తోందని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate) పరిధిలో శాంతి భద్రతలు, ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా నిబంధనలు పాటించాలని పేర్కొంటూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు పోలీసు నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాల సమీపంలో, రద్దీ ప్రాంతాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించరాదన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని విగ్రహాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
CP Sai Chaitanya | డీజీ సౌండ్ల కారణంగా ఇబ్బందులు..
ప్రధానంగా డీజే సౌండ్ సిస్టం (DJ Sound System) వాడటం వల్ల వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఇబ్బందులు కలుగుతున్నందున రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు వాడడం నిషేధమని సీపీ వివరించారు. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాంతాల్లో ధ్వని పరిమితి 55 డేసిబెల్స్గా ఉండాలని సూచించారు.
CP Sai Chaitanya | బహిరంగ సభలు..ఊరేగింపులు..
బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించేవారు పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. 500 మంది లోపు హాజరయ్యే సభలకు అసిస్టెంట్ కమిషనర్ నుంచి, 500 మందికి పైగా ఉంటే 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు.
CP Sai Chaitanya | డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు..
ఎవరైనా డ్రోన్లను (Drones) వాడాల్సి వస్తే పోలీసు, సంబంధిత ఏవియేషన్ అధికారుల (Aviation officials) నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. అలాగే నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుంచి అప్రమత్తత అవసరమని ప్రజలకు సూచించారు. పాస్పోర్టు, టూరిజం, ఉపాధి అవకాశాల పేరుతో మోసాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు, వారి వివరాలను, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేయాలన్నారు.
CP Sai Chaitanya | బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధం..
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పూర్తిగా నిషేధించామన్నారు. ఇలాంటి చర్యవల్ల మహిళలు, పిల్లలు, పౌరులపై అసభ్య ప్రవర్తన, ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. కావున ఈ నెల 31 లోపు నిబంధనలు అమలులో ఉన్నాయని, ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.