అక్షరటుడే నిజామాబాద్ సిటీ : Skill Development | యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం (Collector Office)లో విద్యార్థుల కోసం నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాం (SDIP)కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి.సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Skill Development | మారుతున్న కాలానికి అనుగుణంగా..
షబ్బీర్ అలీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.
Skill Development | ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు..
గతంలో ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం వారికోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతోందని చెప్పారు.
Skill Development | అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి (P. Sudarshan Reddy) మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా హైటెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐ (ITI), పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిని టెక్నాలజీ రంగంలో అగ్రగాములుగా నిలబెట్టేందుకు ఏఐ (AI) కోర్సులను తీసుకువచ్చారని, దీనివల్ల వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. రాష్ట్ర యువతను ప్రపంచస్థాయి నిపుణులుగా మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ముందుకు సాగుతోందన్నారు. అనంతరం కాకతీయ విద్యాసంస్థల అధినేత రజనీకాంత్, విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల అధినేత నరేందర్రెడ్డి తదితరులు షబ్బీర్అలీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.