అక్షరటుడే, వెబ్‌డెస్క్ : The Girlfriend Movie Review | ఒక నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకులని మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన “చిలసౌ” చాలామందికి ఇష్టమైన సినిమా.
ఆ తర్వాత “మన్మథుడు 2”తో ఫ్లాప్ చవిచూసిన ఆయన కొన్నాళ్లు దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత రష్మికతో ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend) అనే సినిమా చేశాడు. రష్మిక డేట్స్ కారణంగా పలుమార్లు షూటింగ్ డిలే అయిన ఎట్టకేలకి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం
The Girlfriend Movie Review | కథ :
భూమా (రష్మిక మందన్న) హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో MA ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) MSc కంప్యూటర్స్ చదువుతాడు. మొదటి రోజే ర్యాగింగ్‌లో డ్యాన్స్ చేసి హాట్ టాపిక్ అవుతాడు విక్రమ్. ఆ క్రమంలో భూమాను చూసి ప్రేమలో పడతాడు. నువ్వు నా దానివి, ఇతర అబ్బాయిలతో మాట్లాడకూడదు అని నియంత్రించడం మొదలుపెడతాడు. భూమా ప్రేమలో ఉండి కూడా భయంతో జీవిస్తుంది. చివరికి విక్రమ్ తల్లి జీవితాన్ని చూసాక భూమా తన భవిష్యత్తు ఎలాగో అర్థం చేసుకుంటుంది. ఇక ఆమె అతని నుంచి బయటపడగలదా? అనేదే కథ యొక్క సారాంశం.
The Girlfriend Movie Review | నటీనటుల పర్‌ఫార్మెన్స్:
చిత్రంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) రెండు సీన్స్‌లో కట్టిపడేసినట్టు కనిపించినా, మొత్తం సినిమా అంతా రొటీన్ పర్ఫార్మెన్స్‌గా అనిపిస్తుంది. దీక్షిత్ శెట్టి (Dixit Shetty) నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చక్కగా నటించాడు. అతని యాక్టింగ్ ఈ కథను కొంతవరకు నిలబెట్టింది. రాహుల్ రవీంద్రన్ ప్రొఫెసర్ పాత్ర పోషించాడు. ఈ పాత్ర చాలా స్పెషల్ అని ఓ రేంజ్ లో ఉంటుందని ప్రమోషన్స్ లో చెప్పారు. కానీ సినిమాలో అడదపాదడపా వచ్చి ఓ నాలుగు మోటివేషనల్ మాటలు చెప్పి వెళ్ళిపోతూఉంటాడు తప్ప పెద్దగా కనెక్ట్ కాలేదు. అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, నారా రోహిత్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
The Girlfriend Movie Review | టెక్నికల్ పర్‌ఫార్మెన్స్:
హేషమ్ సంగీతం అందించిన పాటలపై ప్రశాంత్ ఆర్. విహారి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్పష్టంగా ఆధిపత్యం చూపించింది. ప్రతి సన్నివేశంలోని భావోద్వేగాన్ని, పాత్రల ఆత్మను అద్భుతంగా ఎలివేట్ చేయడంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ పనితనం బాగానే ఉన్నా, కలర్ టోన్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే విజువల్స్ మరింత ఆకర్షణీయంగా ఉండేవి. కథ మూడ్‌కి అనుగుణంగా సన్నివేశాల ప్రకారం లైటింగ్ బ్రైట్ నుండి డల్‌గా మారుతూ ఉంటే బాగుండేది. కానీ మొత్తం సినిమా ఒకే డల్ టోన్‌లో సాగిపోవడం థియేటర్ అనుభవాన్ని కొద్దిగా తగ్గించే అంశంగా మారింది.ఆర్ట్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ టీమ్‌లు పరిమిత బడ్జెట్‌లోనూ నాణ్యతతో కూడిన అవుట్‌పుట్ ఇవ్వడంలో మంచి పనితీరు కనబరిచారు.
దర్శకుడు, రచయిత రాహుల్ రవీంద్రన్ (Director Rahul Ravindran) పనితనం విషయానికి వస్తే మహిళా సాధికారత అనే సున్నితమైన అంశాన్ని బోధనా ధోరణిలో కాకుండా రూపకాల రూపంలో చెప్పిన తీరు ఆకట్టుకుంది. హీరోయిన్ తనలో తానే కుచించుకుపోతుందనే భావాన్ని విజువల్‌గా బిడ్డ గర్భంలో ముడుచుకున్నట్లుగా చూపించిన విధానం, ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఆమె మనసు అయోమయంలో చిక్కుకున్నట్లు చూపించిన తీరు గట్టిగా ఫీల్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా హాస్టల్ డోర్‌పై పెయింట్ సీన్ – ప్రతి అమ్మాయికి అనుభవపూర్వకంగా తాకే సన్నివేశం. అయితే ఆలోచన ఎంత బాగున్నప్పటికీ, ఆ సన్నివేశాల కాంపోజిషన్ మరియు ఎగ్జిక్యూషన్‌లో కొంత డెప్త్ మిస్సయ్యింది. అందువల్ల రచయితగా రాహుల్ రవీంద్రన్ ఆకట్టుకున్నప్పటికీ, దర్శకుడిగా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఎడిటింగ్ మాత్రం బలహీనంగా ఉంది. సినిమా నిడివి తగ్గిస్తే ఇంపాక్ట్ పెరిగేదేమో.
నటీనటులు : దీక్షిత్ శెట్టి , రష్మిక మందన్న, రావు రమేష్, రోహిణి, అను ఇమ్మాన్యుల్, రాహుల్ రవీంద్రన్
దర్శకుడు : రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు : విద్య కొప్పినీడి – ధీరజ్ మొగిలినేని
సంగీతం : హేషమ్ అబ్దుల్ వహాబ్ – ప్రశాంత్ ఆర్.విహారి
సినిమాటోగ్రఫీ : కృష్ణన్ వసంత్
ఎడిటర్ : చోటా కె.ప్రసాద్
బేనర్ : గీతా ఆర్ట్స్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్
ప్లస్ పాయింట్స్:
ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
పెయింట్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్:
కథ
ఎడిటింగ్
దర్శకత్వం
విశ్లేషణ:
‘ది గర్ల్ ఫ్రెండ్’ — పేరు కొత్తగా ఉన్నా, కథ మాత్రం పాతదే. టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్–సైలెంట్ గర్ల్‌ఫ్రెండ్ అనే సబ్జెక్ట్‌ను చాలా స్లో నేరేషన్‌లో చూపించడం వలన ఎమోషన్ కనెక్ట్ కాలేదు. రష్మిక, దీక్షిత్ నటన బాగున్నా, రైటింగ్‌లో నిబద్ధత లేకపోవడం వల్ల సినిమా బలహీనంగా మారింది. అయితే క్లైమాక్స్ లో రష్మిక ఇచ్చే స్పీచ్ తో అందరూ ఏకీభవించకపోవచ్చు కానీ.. కచ్చితంగా ఆలోచించే రోజు అయితే వస్తుంది. ఆ ఆలోచనను రేకెత్తించగలిగాడు కాబట్టి రాహుల్ సక్సెస్ అయినట్లే అని అనుకోవచ్చు. ఈ ఆలోచన తదుపరి రోజులలో చర్చగా మారితే సినిమా కూడా విజయం సాధించినట్లే.
