అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GHMC Meeting | జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై మంగళవారం ఉదయం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో వాడీవేడిగా చర్చ సాగింది. జీహెచ్ఎంసీ పరిధిని ఇటీవల ప్రభుత్వం విస్తరించిన విషయం తెలిసిందే. అనంతరం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచింది. ఈ క్రమంలో అనేక అభ్యంతరాలు వచ్చాయి. వీటిపై కౌన్సిల్లో చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు వార్డుల విభజన, జీహెచ్ఎంసీ పరిధి పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశం ప్రారంభం అయ్యాక డివిజన్ల విభజనపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్, (MLA Danam Nagender) తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు కార్పొరేటర్లు మాట్లాడారు. వార్డుల విభజనపై వారు తమ అభ్యంతరాలను తెలిపారు. డివిజన్లను ఎలా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
GHMC Meeting | శివారు ప్రాంతాలకు అన్యాయం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs), కార్పొరేటర్లు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిని పెంచడంతో శివారు ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్నారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న గ్రామాన్ని మున్సిపాలిటీ చేశారని, దానిని ఇప్పుడు కార్పొరేషన్లో విలీనం చేశారన్నారు. దాంతో అక్కడ పనులు ఎలా చేయగలుతారని ప్రశ్నించారు. దీంతో ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణతోనే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. ఇంత పెద్ద నగరం ఎక్కడ లేదన్నారు. కమిటీ వేసి దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. జవహర్‌నగర్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నారని మల్లారెడ్డి అన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ 150 డివిజన్ల చెత్త మొత్తం అక్కడ వేస్తున్నారని చెప్పారు. అనారోగ్యంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
GHMC Meeting | అభ్యంతరాలు స్వీకరిస్తాం
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (GHMC Commissioner RV Karnan) మాట్లాడుతూ.. వార్డుల పెంపుపై నోటిఫికేషన్ సిద్ధం చేశామన్నారు. వార్డుల పెంపుపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రేపటితో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగుస్తుందన్నారు. అభ్యంతరాలపై పరిశీలన చేపడతామని తెలిపారు. పాత రికార్డుల్లోని సర్వే నంబర్ల ఆధారంగా పునర్విభజన చేస్తున్నామని వెల్లడించారు. ఆయా వార్డులను ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నుంచి మార్చడం లేదని స్పష్టం చేశారు.
GHMC Meeting | దానం ఆగ్రహం
వార్డుల పునర్విభజనపై ఎలాంటి సమాచారం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనాన్ని ఆయన స్వాగతించారు. అయితే ఈ విలీనం శాస్త్రీయంగా జరిగిందా? లేదా.. అన్నారు. అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచాలని కోరారు. శాస్త్రీయంగా వార్డుల విభజన చేపట్టాలన్నారు.
GHMC Meeting | బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన
జీహెచ్ఎంసీ కార్యాలయం (GHMC Office) వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. తమను సంప్రదించకుండా డివిజన్లు ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎంకు అనుకూలంగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పునర్విభజన చేపట్టాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మూడు పార్టీలు కలిసిపోయాయన్నారు. బీజేపీ కార్పొరేటర్లు సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో వార్డుల పునర్విభజనపై అధికార పక్షానికైనా తెలిసేదన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరిగేవన్నారు. కానీ ప్రస్తుతం మేయర్‌కు కూడా తెలియకుండా పునర్విభజన చేపట్టారని విమర్శించారు.