అక్షరటుడే, వెబ్‌డెస్క్: Flight Restaurant | విమాన ప్రయాణం అనేది చాలామందికి కల. కానీ అందరికీ అది నిజం చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. అయితే ఇప్పుడు ఆ కలను నిజం చేసుకునే అవకాశం దక్కింది హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సమీపంలోని గండిమైసమ్మ(Gandi Maisamma)లో ఏర్పాటు చేసిన ‘టెర్మినల్-1 ఫ్లైట్ రెస్టారెంట్’ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా చెందిన వెంకట్‌రెడ్డి అనే యువకుడు తక్కువ ఖర్చుతో ప్రజలకు విమాన ప్రయాణ అనుభూతి కలిగించాలనే ఆశయంతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. మలేషియాలోని ఒక స్క్రాప్ మార్కెట్ నుంచి పాత విమానాన్ని రూ.35 లక్షలకు కొనుగోలు చేసి, విడిగా ఇండియాకు తెప్పించి, దాన్ని రెస్టారెంట్‌గా మార్చారు. మొత్తం రూ.50 లక్షల వరకు ఖర్చు పెట్టారు.
Flight Restaurant | ఫ్లైట్ ఎక్కిన అనుభూతి..
ఈ రెస్టారెంట్‌లో ప్రవేశించాలంటే సాధారణ హోటళ్ల మాదిరి కాదు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు జరిగే ప్రక్రియలన్నింటినీ అనుకరించారు. పాస్‌పోర్ట్, వీసా చెకింగ్ లా మాక్ చెకింగ్, బోర్డింగ్ పాస్ ఇచ్చి, స్టాంపింగ్ చేయడం, వెయిటింగ్ లాంజ్‌లో కూర్చొని టోకెన్ నంబర్ కోసం ఎదురుచూడడం, ఎయిర్ హోస్టెస్‌లు స్వాగతం పలకడం, సీట్ బెల్ట్ వేసుకోవాలని చెప్పడం, వెల్‌కమ్ డ్రింక్‌తో పాటు, ఆర్డర్ చేసిన భోజనం సర్వ్ చేయడం, ఇవన్నీ అచ్చం ఫ్లైట్‌లో జరిగేలా ప్లాన్ చేశారు. డోర్స్ అవే క్లోజ్ కావడంతో , నచ్చినది తింటూ కేవలం 45 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. ఇందులో మనం కూర్చుంటే ఫ్లైట్ జర్నీ (Flight Journey) చేసిన ఫీలింగ్ వస్తుంది. ఈ టెర్నినల్ -1 ఫ్లైట్ రెస్టారెంట్(‘Terminal-1 Flight Restaurant’) మాత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి.
భోజనం పూర్తైన తర్వాత విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఇచ్చినట్లుగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి బయటకు పంపిస్తారు. బయటకు వచ్చిన వారిలో ఎక్కువమంది “ఫ్లైట్ ఎక్కినట్టే ఫీలింగ్ వచ్చిందిరా!” అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి ‘విమాన రెస్టారెంట్’ ఇది కాగా, వినియోగదారులకు విమానంలో ప్రయాణం చేసే అనుభూతిని కలిగించడం కోసం ఇలా ఏర్పాటు చేశామని వెంకట్ రెడ్డి(Venkat Reddy) అన్నారు. అయితే ఆయన చేసిన ప్రయత్నంలో విజయం సాధించారు కూడా. ఇప్పటికే చాలా మంది దీనిని చూసేందుకు, ఆస్వాదించేందుకు భారీగా బుకింగ్స్ చేస్తున్నారు.