అక్షరటుడే, వెబ్‌డెస్క్: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది. రేపు(ఆగస్టు 17) చిరంజీవితో ఫెడరేషన్, నిర్మాతలు విడివిడిగా భేటీ కానున్నారు.
చిరంజీవి జోక్యం చేసుకోవాలని ఫెడరేషన్ కోరనున్నట్లు తెలిసింది. చిరంజీవి జోక్యంతోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood) లో పని చేస్తున్న అన్ని రంగాల కార్మికులకు 30శాతం వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ (Film Fedaration) నాయకులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జీతాలు పెంచకపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమ(film industry)లో కొన్ని రోజులుగా షూటింగ్ (Shootings)లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో గత శనివారం జరిగిన కీలక సమావేశంలో మూడు విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించారు.
తొలి ఏడాది 15 శాతం, రెండు, మూడో ఏడాది 5 శాతం చొప్పున జీతాలు పెంచుతామని ప్రకటించారు. రూ.2 వేల లోపు ఉన్నవారికి మొదటి ఏడాది 15 శాతం పెంచాలని, రూ. వేయిలోపు ఉన్నవారికి 20 శాతం పెంచాలని నిర్ణయించారు.
అయితే చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. షరతులకు అంగీకరిస్తేనే వేతనాల పెంపు అమలు చేస్తామన్నారు. కాగా, చిన్న సినిమా అంటే ఎంత బడ్జెట్ అనే వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
అర్హులైన కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వాలన్నదే తమ అభిప్రాయం అన్నారు. అయితే ఇప్పటికే రోజుకు రూ.5 వేలు తీసుకుంటున్న కార్మికుల జీతాలు పెంచమనడం సరికాదని నిర్మాతలు పేర్కొన్నారు.
film industry bandh issue | నిర్మాతల నిర్ణయం తిరస్కరణ
నిర్మాతలతో సినీ కార్మికుల ఫెడరేషన్ చర్చలు విఫలమైనట్లు అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతల షరతులను అంగీకరిస్తాం కానీ.. అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. యూనియన్లను విడగొట్టేలా నిర్మాతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిరసనలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
కాగా, ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇరువర్గాలు కూడా చిరంజీవి సమక్షంలో పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.